Ravi Teja: వరుస ఫ్లాప్స్.. అందరికీ నచ్చాలని లేదుగా..!
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ 2023 నుంచి 2024 ఫిబ్రవరి వరకు దాదాపు 4 సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. వీటిలో ఏ సినిమా కూడా బ్రహ్మాండంగా ఆడింది అని చెప్పుకునేవి లేవు. ఒక ఏడాదిలో రిలీజ్ అయినవే కావు. రవితేజ నటించిన గత పది సినిమాల్లో ధమాకా (Dhamaka), క్రాక్ (Krack) సినిమాలు తప్ప మిగతావన్నీ అట్టర్ ఫ్లాప్స్‌గా నిలిచాయి.
రవితేజ నటించిన గత 10 సినిమాలు
అమర్ అక్బర్ ఆంటోనీ
క్రాక్
డిస్కో రాజా
ఖిలాడీ
రామారావు ఆన్ డ్యూటీ
రావణాసుర
ధమాకా
టైగర్ నాగేశ్వరరావు
ఈగల్
రవితేజ సినిమాలు చేస్తున్న స్పీడ్ చూస్తుంటే ఆయన కేవలం సినిమాలు చేసి డబ్బులు సంపాదించే పనిలో మాత్రమే ఉన్నారు కానీ ఒక మంచి స్క్రిప్ట్‌తో ఫ్యాన్స్‌ని అలరించాలన్న ఉద్దేశంలో మాత్రం లేరని తెలుస్తోంది. ఇదే విషయాన్ని కొందరు నిర్మాతలు ఓ మీటింగ్‌లో చర్చించినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. రవితేజ వరుసగా సినిమాలు చేసేస్తున్నారు కానీ క్వాలిటీని మాత్రం పట్టించుకోవడంలేదన్న టాక్ వచ్చిందట. అప్పుడు అదే మీటింగ్‌లో ఉన్న ఓ రచయిత రవితేజకు సపోర్ట్ చేసారు. ఇప్పుడు కొత్తగా రవితేజ తన ట్రాక్ రికార్డ్ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదని.. ఇప్పుడే వరుసగా సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు వెనకేసుకోగలడని.. ఇంకొన్నేళ్లయితే ఈ సినిమాలు కూడా రాకుండాపోయే అవకాశం ఉందని అన్నారట.
రవితేజ మంచి స్క్రిప్ట్ ఎంచుకోవడం లేదు అని అనే బదులు మంచి కథలు ఈ మధ్యకాలంలో అసలు టాలీవుడ్‌కి రావడంలేదు అంటే బాగుంటుందని ఆ రచయిత అభిప్రాయపడ్డారట. మంచి కథ కోసం రవితేజ ఎదురుచూస్తూ కూర్చుంటే సమయాన్ని వృథా చేసుకోవడం తప్ప ఏమీ ఉండదని.. అదేదో వచ్చిన స్క్రిప్ట్‌ని ఒప్పుకుని సినిమా చేస్తే లక్కీగా క్లిక్ అయ్యే ఛాన్స్ అన్నా ఉందని అంటున్నారు. అయితే రవితేజ తన దగ్గరికి వస్తున్న అన్ని సినిమాలను ఓకే చేస్తున్నారని అనడానికి వీల్లేదని.. రెండేళ్ల క్రితం ఓ దర్శకుడు కథతో వెళ్తే అది బాలేదని ఆయన ఒప్పుకోలేదని మరో దర్శకుడు రవితేజకు సపోర్ట్‌గా నిలిచారు. పారితోషికం విషయంలో అయినా రవితేజ కాస్త తగ్గుతారు కానీ స్క్రిప్ట్ బాలేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా ఆయన చేయరని తెలిపారు.
రవితేజ అన్న గురించి ఇలా మాట్లాడితే ఊరుకోను
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌కు రవితేజ అంటే ఎంతో అభిమానం. ఆయన త్వరలో రవితేజతో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించేసారు కూడా. ఈ సినిమా కోసం హరీష్ శంకర్ ఇలియానా, మీనాక్షి చౌదరిలను సంప్రదించారని.. కానీ వారిలో ఒకరు డేట్లు సర్దుబాటు కాకపోవడం వల్ల మరొకరు రెమ్యునరేషన్ విషయంలో విభేదాలు రావడం వల్ల ఒప్పుకోలేదని ఓ వెబ్‌సైట్ ట్వీట్ చేసింది.
ఆ వెబ్‌సైట్‌లో హరీష్ శంకర్ యానిమల్ ఫేం తృప్తి డిమ్రిని సంప్రదించనున్నట్లు రాసుకొచ్చారు. ఈ ట్వీట్ హరీష్ శంకర్ కంట పడటంతో వెంటనే ఆయన క్లారిటీ ఇచ్చారు. తన ట్రాక్ రికార్డ్ తెలిసినవారు రిజెక్ట్ చేయరని.. శృతి హాసన్‌కి కానీ పూజా హెగ్డేకి కానీ తన సినిమాలపై నమ్మకం ఉందని యానిమల్ సినిమా కంటే ముందే రవితేజ సినిమాకు కావాల్సిన క్యాస్టింగ్ సెలెక్ట్ అయిపోయిందని స్పష్టం చేసారు. తన మాస్ మహారాజా రవితేజ గురించి ఇలాంటి తప్పుడు రూమర్స్ సృష్టిస్తే బాగోదని.. కన్‌ఫం చేసుకోవడానికి తనకు ఒక్క ఫోన్ కాల్ దూరంలో రవితేజ ఉన్నారని గడ్డిపెట్టారు హరీష్ శంకర్.