Health: చ‌లికాల నొప్పులు వేధిస్తున్నాయా?

Health: చ‌లికాలంలో పుట్టే వ‌ణుకుకు ఒంట్లోని కొన్ని భాగాల్లో విప‌రీత‌మైన నొప్పులు వ‌స్తుంటాయి. చ‌లిగా అనిపించిన‌ప్పుడు మాత్రమే ఈ ర‌క‌మైన నొప్పులు వ‌స్తుంటాయి. వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం.

ఈ నొప్పులు కీళ్ల‌వాతం స‌మ‌స్య ఉన్న‌వారికి మ‌రింత ఎక్కువ‌గా ఉంటాయి. వాతావ‌రణం మార్పుకి ఒంట్లో వ‌చ్చే నొప్పుల‌కు సంబంధం ఏంటా అని ఇంకా శాస్త్రవేత్త‌లు రీసెర్చ్‌లు చేస్తూనే ఉన్నారు. వారి రీసెర్చ్‌లు అయ్యేవ‌ర‌కు మ‌నం నొప్పుల‌ను భ‌రిస్తూ కూర్చోలేంగా..! అందుకే ఈ టిప్స్ పాటించేస్తే స‌రిపోతుంది.

*చ‌లికాలంలో వ్యాయామం చేస్తే నొప్పులు మ‌రింత ఎక్కువ అవుతాయ‌ని చాలా మంది వ్యాయామానికి దూరంగా ఉంటారు. ఇలా చేస్తే నొప్పులు మ‌రింత తీవ్రం అయ్యే ప్ర‌మాదం ఉంటుంది. ఒంట్లోని కీళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు క‌దులుతూనే ఉండాలి. ఒకే ద‌గ్గ‌ర కూర్చుండిపోతే ప‌ట్టేస్తాయి. ఆ నొప్పిని భ‌రించ‌డానికి పెయిన్ కిల్ల‌ర్లు వాడాల్సి వ‌స్తుంది.

*జిమ్‌కి వెళ్ల‌లేనివారు సైక్లింగ్, వాకింగ్, జాగింగ్ వంటివి చేసుకుంటే స‌రిపోతుంది. గోడ కుర్చీలు, కుర్చీపై కూర్చుని కాళ్ల‌ను పైకి కింద‌కి లేప‌డం వంటి వ్యాయామాలు కూడా చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

*నొప్పులు వ‌స్తుంటే హాట్ లేదా కోల్డ్ ప్యాక్స్ పెట్టుకోండి. చిన్న చిన్న నొప్పుల‌కు కూడా పెయిన్ కిల్ల‌ర్లు వాడేస్తుంటారు కొంద‌రు. ఇది అస్స‌లు మంచిది కాదు అనే విష‌యాన్ని గుర్తుపెట్టుకోండి.

*చ‌లికాలంలో నీళ్లు తాగినా తాగ‌క‌పోయినా మూత్రం వ‌స్తూనే ఉంటుంది. అందుక‌ని నీళ్లు త‌క్కువ‌గా తాగుతుంటారు. ఇది అస్స‌లు మంచిది కాదు. శ‌రీరం డీహైడ్రేట్ అయిపోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు నీళ్లు తాగుతూ ఉండండి.