పొయ్యి పక్కనే నూనె.. తస్మాత్ జాగ్రత్త!
Cooking Oil: కొందరు పొయ్యి లేదా గ్యాస్ స్టవ్ పక్కనే నూనె సీసాలు, నూనె బాటిళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరం అని అంటున్నారు వైద్య నిపుణులు. వంట చేస్తున్న సమయంలో స్టవ్ నుంచి వచ్చే వేడి ఆక్సిడేషన్‌ను పెంచుతుంది కాబట్టి.. పక్కనే పెట్టిన నూనె త్వరగా పాడైపోతుంది. ఈ వేడి వల్ల పక్కన పెట్టిన నూనె పాడైందన్న విషయం కూడా మనకు తెలీకపోవచ్చు. తెలీక వాడేస్తే మాత్రం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులతో పాటు జుట్టు తెల్లబడిపోవడం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
నూనె ఎప్పుడు పాడవుతుంది?
నూనెల్లో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నూనెకు గాలి తగిలితే ఆ కొవ్వు పదార్థాలు పాడైపోతాయి. ఆక్సిజన్ నూనెలోని కొవ్వును పాడుచేస్తుంది.
వంట నూనెలను ఎలా భద్రపరుచుకోవాలి?
ఒకవేళ పల్లీ నూనె, ప్రొద్దుతిరుగుడు నూనెలు వాడుతున్నట్లైతే చల్లగా చీకటిగా ఉండే ప్రదేశాల్లో పెట్టండి. చల్లగా అంటే ఫ్రిడ్జ్‌లో మాత్రం కాదు సుమీ.
కంటైనర్లలో ఉండే నూనెలను కొనుగోలు చేసినట్లైతే మూత గట్టిగా పెట్టుకుంటూ వాటిలోనే ఉంచి వాడుకోవడం బెటర్. కంటైనర్ నుంచి తీసి వేరే దానిలో పోసుకోవడం వంటివి చేయకండి.
ఒకవేళ ఆలివ్ ఆయిల్‌ను వాడుతున్నట్లైతే అవి ప్రత్యేకంగా గ్రీన్ రంగులో ఉండే బాటిళ్లలో వస్తాయి. అవి చాలా బెటర్.
అయితే ఆలివ్ ఆయిల్‌ను మూడు నుంచి ఆరు నెలల్లోపు వాడేయడం మంచిది.
వాల్నట్, బాదం వంటి నూనెలైతే.. ఫ్రిజ్‌లో పెట్టుకోవడం బెటర్. డార్క్ రంగులో ఉండే గాజు సీసాల్లో పెట్టుకోవడం మరీ మంచిది.