Sleep: 8 గంటలు నిద్రపోయినా అలసటగా ఉంటోందా?
Sleep: నిద్ర అనేది మనిషికి చాలా ముఖ్యం. ఒకపూట ఆహారం లేకపోయినా ఫర్వాలేదు కానీ.. ఒక పూట నిద్రలేకపోతే మనిషి ఆయుర్దాయంలో కొన్ని రోజులు తగ్గిపోతాయట. ప్రస్తుత రోజుల్లో కొందరికి పాపం నాలుగు గంటల పాటు కూడా నిద్ర ఉండటం లేదు. మరికొందరు నైట్ షిఫ్ట్స్ వల్ల ఉదయం పూట నిద్రపోలేకపోతున్నారు. మరికొందరు 8 గంటల నుంచి 10 గంటల పాటు నిద్రపోతుంటారు కానీ అయినా నిరుత్సాహంగా, అలసటగా కనిపిస్తుంటారు. అన్ని గంటలు నిద్రపోయినా అలసట ఎందుకు వస్తుంది? ఆ అలసటను ఎలా తగ్గించుకోవాలి? వంటి విషయాలను తెలుసుకుందాం.
ఐరన్ లోపం
ఎంత నిద్రపోయినా అలసటగా అనిపించడానికి ప్రధాన కారణం ఎనీమియా (ఐరన్ లోపం). రక్తంలో హెమోగ్లోబిన్‌ను పెంచేందుకు ఐరన్ సాయపడుతుంది. హెమోగ్రోబిన్ అంటే శరీరానికి ఆక్సిజన్ అందించే ఎర్రటి రక్త కణాల్లో ఉండే ఒక కాంపోనెంట్. శరీరంలో ఐరన్ లోపిస్తే హెమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఫలితంగా శరీరంలోని అవయవాలకు సరైన ఆక్సిజన్ అందదు. దీని వల్ల నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.
ఏం తినాలి?
ఐరన్ ఒంటికి బాగా అందాలంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. పాలకూర ఎంత తీసుకుంటే అంత ఐరన్ అందుతుంది. దీంతో పాటు మాంసకృతులు, పప్పుదినుసులు వంటివి నిత్య ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
విటమిన్ B12
శరీరంలో విటమిన్ B12 లోపించినా నీరసంగానే ఉంటుంది. ఎర్ర రక్త కణాలు వృద్ధి చెందాలన్నా, నరాల పనితీరు బాగుండాలన్నా బిటమిన్ B12 ముఖ్యం. B12 లోపించిందంటే దేని మీదా ఏకాగ్రత ఉండదు. నీరసంగా ఉంటుంది. కూర్చుని నిలబడినా కళ్లు తిరుగుతుంటాయి.
ఏం తినాలి?
మాంసం, గుడ్లు, బీన్స్‌లో B12 పుష్కలంగా ఉంటుంది.
విటమిన్ D
Sleep: శరీరంలోని కాల్షియం అబ్సర్వ్ చేసుకోవడానికి విటమిన్ D ఎంతో కీలకం. మిగతా విటమిన్లన్నీ మనం కొన్ని ఆహారాలను తీసుకుంటేనో.. లేదా సప్లిమెంట్ల రూపంలోనో తీసుకోవాల్సి ఉంటుంది కానీ విటమిన్ D అనేది సహజ సిద్ధంగా ప్రకృతి నుంచే లభిస్తుంది. అదే లేలేత సూర్యకిరణాలు. సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఒక్క పది నిమిషాలు రోజూ నిలబడితే చాలు శరీరంలోని హార్మోన్లన్నీ సెట్ అవుతాయి. కావాలంటే ఒకసారి ప్రయత్నించి చూడండి. శరీరంపై సూర్యకిరణాలు బాగా పడేలా చూసుకుంటే చాలు. సూర్య కిరణాలే కాకుండా చేపలు, గుడ్లు తీసుకున్నా మంచిదే.
మెగ్నీషియం
నాడీ వ్యవస్థ, కండరాల పనితీరు బాగుండాలంటే మెగ్నీషియం ఎంతో ముఖ్యం. ఇది లోపిస్తే ఎక్కడ లేని నీరసం, కండరాలు పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి.
ఏం తినాలి?
నట్స్, విత్తనాలు, తృణధాన్యాలు
విటమిన్ B9
ఒంట్లో కొత్త కణాలు, ఎర్ర రక్త కణాలు రావాలంటే విటమిన్ B9 ఎంతో ముఖ్యం. దీనినే ఫోలేట్ అంటారు. ఈ ఫోలేట్ తగ్గితే డిప్రెషన్ కూడా వస్తుంటుంది. నచ్చిన పని మీద కూడా ఏకాగ్రత ఉండదు.
ఏం తినాలి?
అరటిపండ్లు, ఆకుకూరలు, నారింజ పండ్లు. ఇవన్ని తింటూనే రోజూ తగినన్ని నీళ్లు తాగుతూ ఉండండి.
అన్నీ బానే తింటున్నాం. అయినా అలసటగా అనిపిస్తుంటే మాత్రం వైద్యులను సంప్రదించాల్సిందే. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా నీరసంగా అనిపిస్తుంటుంది అన్న విషయం గుర్తుంచుకోండి.