ఎక్స్‌పైరీ అయిపోయిన మందులు వేసుకుంటే ఏం జ‌రుగుతుంది?

Medicine: ఎక్స్‌పైర్ అయిపోయిన మందులను వేసుకోకూడ‌దు అంటుంటారు. ఒక్క రోజు తేడా ఉన్నా కూడా వాటిని ప‌డేస్తారు. ఒక‌వేళ తెలీక‌ అలా వేసుకున్న‌ప్పుడు ఏం జ‌రుగుతుంది? ప్రాణాల‌కే ప్ర‌మాద‌మా? లేక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?

1985లో అమెరికాకు చెందిన ఎయిర్ ఫోర్స్ అధికారులు ఓ రీసెర్చ్ చేసారు. బిలియ‌న్ డాల‌ర్లు విలువైన మందుల‌ను కొని పెట్టుకోగా.. అవి ఎక్స్‌పైర్ అయ్యి మూడేళ్లు అయిపోయింది. వేసుకుందామా అంటే ప్రాణాల‌కు ముప్పేమో అని భ‌యం. ప‌డేద్దామా అంటే వాటి ధ‌ర కొన్ని కోట్ల రూపాయ‌లు. ఏది అయితే అది అయ్యింద‌నుకుని ఆ మందుల‌ను వేసుకున్నారు. ఆ మందుల‌ను వేసుకున్నాక తెలిసింది ఏంటంటే.. నైట్రో గ్లిస‌రిన్, ఇన్సులిన్, లిక్విడ్ యాంటిబ‌యోటిక్స్ మిన‌హా మిగ‌తావి ఎక్స్‌పైర్ అయ్యి మూడేళ్లు అయినా కూడా బాగానే ప‌నిచేసాయి. అయితే ఈ ప‌రిశోధ‌న 1980 నుంచి 1990 మ‌ధ్య‌లో జ‌రిగింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన కొత్త మందుల‌పై ఇలాంటి ప్ర‌యోగం చేయ‌లేదు.

2019లోనూ ఇలాంటి అంశంపై ఎనాల‌సిస్ చేసారు. దాదాపు అన్ని ఫార్మాసూటికల్ ఉత్ప‌త్తుల ఎక్స్‌పైరీ తేదీ అయిపోయి న త‌ర్వాత కూడా బాగానే ప‌నిచేసాయ‌ని తేలింది. అయితే ఈ ఎనాల‌సిస్‌ని అన్ని మందుల‌కు వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌లేం. ఒక ట్యాబ్లెట్ ఎక్స్‌పైర్ అయిపోయి నెల రోజులు అవుతున్నా అది వేసుకోవ‌చ్చు. కానీ కొన్నేళ్లు గ‌డిచిన‌వి వేసుకుంటే మాత్రం అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. ట్యాబ్లెట్ల‌ను ఎలాంటి ప్ర‌దేశంలో ఉంచుతున్నారు అనేది కూడా చూసుకోవ‌డం ఎంతో ముఖ్యం. చ‌ల్లని పొడిగా ఉన్న వాతావ‌ర‌ణంలో ఉంచాలి. వేడి లేదా త‌డి ఉన్న ప్ర‌దేశాల్లో ఉంచితే అవి పాడైపోతాయి. వేసుకున్నా ప‌నిచేయ‌వు.

ఇది కేవ‌లం స‌మాచారం కోసం మాత్ర‌మే ప్ర‌చురించిన వార్త‌. దీనిని ఉదాహ‌ర‌ణ‌గా తీసుకుని ఎక్స్‌పైర్ అయిపోయిన మాత్ర‌లు, మందులు వేసుకోవ‌డం మంచిది కాదు. మీకు సందేహాలు ఉంటే వైద్యుల‌ను సంప్ర‌దించ‌గ‌ల‌రు