Health: అనారోగ్య సమస్యలు.. అపోహలు..తిప్పలు!
Health: కొన్ని అనారోగ్య సమస్యల విషయంలో చాలా మంది నిజాలను వదిలేసి అపోహలను నమ్ముతుంటారు. మరికొందరు వైద్యులు ఇవే అపోహలను నిజాలుగా చెప్పి రోగుల నుంచి డబ్బులు లాగాలని చూస్తుంటారు. అనారోగ్య సమస్యల విషయంలో మనం నమ్మే అపోహలేంటో చూద్దాం.
రాత్రి ఆలస్యంగా తింటే బరువు పెరుగుతారా?
ఈ మాట చాలా మంది నుంచి విని ఉంటారు. నిజానికి ఎప్పుడు తిన్నామన్నది కాదు.. ఎన్ని కేలొరీలు ఆరగించామన్నది ముఖ్యం. రాత్రి పడుకోవడానికి రెండు గంటల ముందు భోజనం ముగించేయమని చెప్తుంటారు. ఇది కరెక్ట్. ఎందుకంటే తిన్న వెంటనే పడుకుంటే అరుగుదల ఉండదు కాబట్టి. ఎవరైనా రాత్రి ఆలస్యంగా తింటున్నావు బరువు పెరిగిపోతావు అని మీతో అంటే.. అబ్బా ఛా.. అయితే ఉదయం పూట ఎన్ని కేలొరీలు తిన్నా సన్నగానే ఉంటామా? అని అడగండి.
రోజుకి 8 గ్లాసుల నీళ్లు తాగాలా?
ఇలా చాలా మంది నుంచి వినే ఉంటారు. నిజానికి ఎవరు ఎన్ని నీళ్లు తాగాలి అనేది వారి ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నవారి వద్దకు వెళ్లి రోజుకు 8 గ్లాసుల నీళ్లు తాగండి అని చెప్తే వారు వెటకారంగా చూస్తారు. ఎందుకంటే కిడ్నీ సమస్యతో ఉన్నవారు ఏది తాగాలన్నా తినాలన్నా వైద్యుల సలహా తీసుకోకుండా చేయకూడదు. కిడ్నీ అనే కాదు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా లేకపోయినా మీరు ఇలా 8 గ్లాసుల నీళ్లు తాగు అని చెప్పకండి. మీ ఉచిత సలహా వల్ల ఏదన్నా జరగకూడనిది జరిగితే ఇరుక్కుంటారు. నిజానికి ఎప్పుడు దాహం వేస్తే అప్పుడు నీళ్లు తాగడం ఉత్తమం.
నల్ల చర్మం ఉన్నవారికి స్కిన్ క్యాన్సర్ రాదా?
చాలా మందికి ఉండే అపోహ ఇది. చర్మం నల్లగా ఉంటే స్కిన్ క్యాన్సర్ రాదు అనుకుంటారు. అలాంటిదేమీ ఉండదు. కాకపోతే సూర్యుడి నుంచి వెలువడే అల్ట్రావైలెట్ కిరణాలు డార్క్ చర్మం ఉన్నవారిపై పడితే దాని ప్రభావం కాస్త తక్కువగా ఉంటుంది. ఎందుకంటే వీరికి మెలనిన్ లెవెల్స్ అధికంగా ఉంటాయి.
డిటాక్స్ డైట్లు ఒంట్లోని విష పదార్థాలను తొలగిస్తాయా?
అలాగని ఏమీ లేదు. మన శరీరంలోని చాలా మటుకు అవయవాలు వాటి పని అవి చేస్తూ ఒంట్లోని విష మలినాలను మూత్రం, చెమట రూపంలో బయటికి పంపిస్తుంటాయి. అంతేకానీ.. ప్రత్యేకించి డిటాక్స్ డైట్లు తీసుకోవడం వల్ల ఒంట్లో ఏమీ జరగదు. కాకపోతే డిటాక్స్ డైట్ పేరుతో ఎటూ మంచి ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి ఎనర్జిటిక్‌గా ఉంటారు.
ఎక్కువ చెక్కర తింటే షుగర్ వస్తుందా?
చెక్కర తింటే షుగర్ రాదు. కానీ షుగర్ ఉన్న వారు చెక్కర తినకూడదు. అదే మ్యాజిక్. డయాబెటిస్‌లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 మరొకటి టైప్ 2. టైప్ 1 అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. దీనికి షుగర్‌కి, జీవనశైలికి ఎలాంటి సంబంధం లేదు. టైప్ 2 అనేది ఇష్టమొచ్చినట్లు తినేయడం, వ్యాయామం చేయకపోవడం వల్ల వస్తుంది.
క్యారెట్లు కంటి చూపును మెరుగుపరుస్తాయా?
చాలా మందికి ఉండే అపోహ ఇది. క్యారెట్లు తింటే కంటి చూపు పెరుగుతుందని. అలాంటిదేమీ లేదు. కాకపోతే క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్‌ను మన శరీరం విటమిన్ ఏగా మారుస్తుంది. అంతేకానీ.. క్యారెట్లు తినడం వల్ల కంటి చూపు పెరగడం.. కళ్ల సమస్యలు తగ్గడం వంటివి జరగవు.