Hyderabad: నవ్వుతూ కుప్పకూలిపోయిన వ్యక్తి.. ఏంటీ వ్యాధి?
Hyderabad: నవ్వు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు. కానీ అదే నవ్వు వల్ల ఓ వ్యక్తి హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్లో చోటుచేసుకుంది. హైదరాబాద్కి చెందిన 53 ఏళ్ల శ్యాం అనే వ్యక్తి.. నిన్న మధ్యాహ్నం చాయ్ తాగుతూ ఓ కామెడీ ప్రోగ్రామ్ చూస్తున్నాడట. అతను ఆ ప్రోగ్రామ్ చూస్తూ దాదాపు అరగంట పాటు నవ్వుతూనే ఉన్నాడు.
ఉన్నట్టుండి అతను కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అపోలోకు తరలించారు. కాసేపటి తర్వాత లేచి మామూలుగానే అందరితో మాట్లాడాడట. అసలు ఆ వ్యక్తికి ఏమైందా అని అపోలో వైద్యుడు సుధీర్ పరీక్షలు చేయగా.. ఆరోగ్యంగానే ఉన్నట్లు రిపోర్టులు చెప్తున్నాయి. మరి ఎందుకు అలా పడిపోయడా అని సుధీర్ మరికొన్ని పరీక్షలు చేయగా.. అతనికి లాఫ్టర్ ఇన్డ్యూస్డ్ సింకోప్ అనే సమస్య ఉందట. అంటే ఎక్కువగా నవ్వడం వల్ల ఉన్నట్టుండి స్పృహ కోల్పోయి చేతులు కాళ్లు వణుకుతుంటాయి.
దీని నుంచి గుండె సమస్యలు కూడా వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్ సుధీర్ తెలిపారు. ఎక్కువ సేపు గట్టిగా నవ్వడం వల్ల ఉన్నట్టుండి బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఆ తర్వాత మెదడుకు రక్త సరఫరా అగిపోయి ఇలా ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోతారట.