Saree: చక్కగా చీర కడుతుంది.. ఫీజ్ లక్ష రూపాయలు!
Hyderabad: సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తే లక్షల్లో జీతం ఉంటుందని విన్నాం కానీ.. ఓ చీర(saree) కట్టినందుకు కూడా లక్షల్లో జీతం తీసుకుంటోంది ఓ మహిళ. ఎన్ని చాట్ జీపీటీ లాంటి AIలు వచ్చినా.. తన ఉద్యోగానికి ఎలాంటి ఢోకా లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆవిడే.. డాలీ జైన్. ఈమె ఒక సెలబ్రిటీ శారీ డ్రేపర్. అంటే వేరే క్లైంట్లకు చీరలు కడుతుంటారు. చీర కట్టడం అంటే నాలుగు కుచ్చులు పెట్టి పిన్ను పెట్టి కట్టేసామా అన్నట్లు కాదు. ఆమె చీర కడితే చూపు తిప్పుకోలేనంత అందంగా కడుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 300 పైగా స్టైల్స్‌లో చీరలు కడుతుంది.
ఈ డాలీ జైన్ అనే ఆవిడ గురించి కాంచన్ నంద అనే కెరీర్ కౌన్సిలర్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. ఓ పాడ్‌కాస్ట్‌లో కాంచన్ పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆమెకు డాలీ జైన్ అనే శారీ డ్రేపర్ గురించి తెలిసిందని చెప్పారు. “మా అబ్బాయి పెళ్లికి వచ్చిన కొందరు మహిళలు చీరకట్టిన విధానం చూసి నేనే షాకయ్యా. అసలు అంతబాగా ఎలా కట్టుకున్నారా అని అడిగాను. అప్పుడు ఒక ఆవిడ డాలీ జైన్ అనే మహిళ చేత కట్టించుకున్నాను అని చెప్పింది. ఎలాగైనా నేను కూడా అలా చీరకట్టించుకోవాలని డాలీ నెంబర్ తీసుకుని ఫంక్షన్‌కు రమ్మని చెప్పా. నాకు చక్కగా చీరకట్టింది. అంతవరకు బాగానే ఉంది కానీ.. ఆమె అడిగిన ఫీజ్ విని నేను షాకయ్యాను. ఒక్కో చీర కట్టడానికి అక్షరాలా రూ.1.10 లక్షలు తీసుకుంటుందట. అలా మా అబ్బాయి పెళ్లిలోనే ఆమె దాదాపు 36 లక్షల రూపాయలు సంపాదించింది” అని తెలిపారు. అలా డాలీ ఎన్ని AIలు వచ్చినా ఏమీ చేయలేని వృత్తిని ఎంచుకుని లక్షల్లో సంపాదించేస్తోంది.