Odisha Train Accident: ప్రభుత్వ ఉద్యోగం కోసం నాటకం
Patna: వారం రోజుల క్రితం జరిగిన ఒడిశా రైలు ప్రమాద (odisha train accident) ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను వాడుకుని ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయాలని భావించాడు ఓ వ్యక్తి. ప్లాన్ బెడిసికొట్టడంతో పోలీసులకు దొరికేసాడు. బిహార్‌కు చెందిన సంజీవ్ కుమార్ అనే వ్యక్తి ఈ కుట్ర పన్నాడు. సంజీవ్ తల్లి 2018లోనే చనిపోయారు. అయితే ఆమె మొన్న జరిగిన ఒడిశా రైలు ప్రమాదంలో చనిపోయారని చెప్పి ప్రభుత్వ ఉద్యోగం కొట్టేయాలనుకున్నాడు. ఇందుకోసం నేరుగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసేందుకు దిల్లీ వెళ్లాడు.
ముందు అశ్విని వైష్ణవ్ ఉంటున్న నివాసానికి వెళ్తే అక్కడి అధికారులు వివరాలు తీసుకుని రైల్ భవన్‌కు వెళ్లాలని సూచించారు. రైల్ భవన్‌కు వెళ్లాక అక్కడి అధికారులు వివరాలు అడిగినప్పుడు వేరే రకంగా చెప్పాడు. అక్కడే సంజీవ్ దొరికిపోయాడు. “సంజీవ్ మా దగ్గరికి వచ్చి ఒడిశా రైలు ప్రమాదంలో తన తల్లి చనిపోయారని చెప్పాడు. కానీ మేం విచారణ చేపట్టినప్పుడు ఆమె అసలు అందులో ప్రయాణించలేదని తెలిసింది. ఆమె పేరుతో ఉన్న టికెట్ చూపించమని అడిగితే ఆన్‌లైన్‌లో బుక్ చేయలేదని ట్రావెల్ ఏజెంట్ ద్వారా బుక్ చేసానని చెప్పాడు. ఆ ట్రావెల్ ఏజెంట్ పేరు చెప్పమంటే తెలీదన్నాడు. అప్పుడే మాకు అనుమానం వచ్చింది. అతని తల్లి ఫొటో ఆధారంగా అన్ని స్టేషన్స్‌లో ఎంక్వైరీ చేసాం. ఆమె అసలు ఆ రోజున ఏ రైలులోనూ ప్రయాణించలేదని తెలిసింది. ఇంకాస్త లోతుగా విచారిస్తే అతని తల్లి 2018లోనే చనిపోయిందని తెలిసింది. ఉద్యోగం కోసం సంజీవ్ డ్రామా ఆడాడని తెలిసి అదుపులోకి తీసుకున్నాం” అని అధికారులు తెలిపారు.
ఇదే విధంగా కొన్ని రోజుల క్రితం ఓ మహిళ తన భర్త చనిపోయాడని చెప్పి ఎక్స్‌గ్రేషియా డబ్బు తీసుకోవాలని చూసింది. కానీ ఆ మహిళ భర్తే ఆమె గురించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం బయటపడింది.