Summer:చెరుకు రసంతో ఎన్ని ఉపయోగాలో!
వేసవికాలంలో ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. అందుకే ప్రత్యామ్నాయంగా చాలామంది కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు తాగడానికే మక్కువ చూపిస్తారు. ఇవే కాకుండా వేసవిలో చెరుకు రసానికీ మంచి డిమాండ్ ఉంటుంది. ఎక్కడ చూసినా చెరుకు రసం బండ్లే కనిపిస్తాయి. నిజానికి ఎండగా ఉన్నప్పుడు ఒక గ్లాసు చల్లని చెరుకు రసం తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. క్షణాల్లో శరీరానికి గ్లూకోజ్ అందించి డిహైడ్రేషన్ బారిన పడకుండా తట్టుకునే శక్తిని ఇస్తుంది. చెరుకు రసంలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్ బి6, విటమిన్ సి తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మన శరీరం కోల్పోయిన చక్కెరను తిరిగి అందించడం ద్వారా డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఎండాకాలంలో చెరుకు రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
* యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన చెరుకు రసం కాలేయాన్ని పలు రకాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. బిల్రూబిన్ స్థాయిలను అదుపులో ఉంచి కాలేయానికి రక్షణ కల్పిస్తుంది. అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవడానికి అవసరమైన ప్రోటీన్లను, పోషకాలను ఇది భర్తీ చేస్తుంది. వడదెబ్బ తాకినవారు ఆ ప్రభావం నుంచి త్వరగా బయటపడేందుకు చెరుకు రసం బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో వారానికి రెండు మూడు సార్లు చెరుకు రసాన్ని తాగడం అలవాటు చేసుకోవడం మంచిది.
* చెరుకు రసం తాగాక మూత్ర విసర్జన ఎక్కువసార్లు అవుతుంది. ఆ మూత్ర విసర్జన ద్వారా శరీరంలోని టాక్సిన్లు, ఇన్ఫెక్షన్లకు కారణమైన వైరస్లు బయటికి పోతాయి. అంతేకాదు చెరుకు రసం తాగడం వల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కూడా తగ్గుతుంది.
* చెరుకు రసం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. పొట్ట ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఈ రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
* వేసవిలో చాలామంది బలహీనంగా మారుతారు. కాబట్టి కచ్చితంగా చెరుకు రసం తాగాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటివి జీర్ణ రుగ్మతలు, కాలేయ వ్యాధులు, శ్వాస కోశ ఇన్ఫెక్షన్లు రాకుండా సహాయపడతాయి.
* చెరుకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, భాస్కరం, ఇనుము, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. ఆస్టియోపొరాసిస్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి.