డీబార్ అయిన విద్యార్థికి ఊరట
తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ పేపర్ లీక్ అయిన విషయం అందిరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు పరీక్ష పేపర్‌ను ఫొటో తీసిన వారితోపాటు దాన్ని షేర్ చేసిన వారిపై కేసులు పెట్టారు. ఇక పరీక్ష పేపర్ ఎవరిదగ్గరి నుంచి అయితే.. ఫొటో తీసుకున్నారో.. ఆ విద్యార్థిని అధికారులు డీబార్ చేశారు. అతని పేరు హరీష్ కాగా.. వాస్తవానికి పేపర్ లీక్ విషయంలో తమ కుమారుడి తప్పు ఏమీ లేదని అతని తల్లిదండ్రులు అధికారులను ఎంతగానో రిక్వెస్టు చేశారు. కానీ వారు పట్టించుకోలేదు. దీంతో అతను శనివారం నిర్వహించిన పరీక్షకు అనుమతించలేదు. దీంతో అతని తండ్రి తన బిడ్డది ఎలాంటి తప్పు లేదని.. హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. తన కొడుకు హరీష్ హిందీ పరీక్ష రాస్తున్న సమయంలో ఎవరో బలవంతంగా పేపర్ లాక్కున్నారని హరీష్ తండ్రి తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించిన కోర్టు సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు రాసేందుకు హరీష్‌కు అనుమతి ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన పరీక్షలు రాసేలా అనుమతివ్వాలని అధికారులను కోర్టు ఆదేశించింది.