Shiva: పొర‌పాటున కూడా శివ‌య్య‌కు ఇవి స‌మ‌ర్పించ‌కండి

Shiva: మ‌న‌కు శివుడు ఎప్పుడూ లింగం రూపంలోనే ద‌ర్శ‌న‌మిస్తుంటారు. లింగానికే పూజ‌లు చేస్తాం కానీ శివుడి విగ్ర‌హం అంటూ ఏమీ లేదు. ఆ లింగాన్ని స‌రైన రీతిలో పెట్టి పూజిస్తేనే ఫ‌లితం ఉంటుంది. ఎలా ప‌డితే అలా చేస్తే దోషాలు క‌లుగుతాయి. అయితే… శివ‌పురాణం ప్ర‌కారం శివ‌య్య‌కు కొన్ని వ‌స్తువుల‌ను స‌మ‌ర్పించ‌కూడ‌దు. అలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ త‌గులుతుంది. శివుడికి పొర‌పాటున కూడా స‌మ‌ర్పించ‌కూడ‌ని వ‌స్తువులు ఉన్నాయి. వాటి గురించి భ‌క్తులు త‌ప్ప‌క తెలుసుకోవాలి.  అవేం వ‌స్తువులో తెలుసుకుందాం.

తుల‌సి (Tulasi)

శివ పురాణం ప్ర‌కారం జ‌లంధ‌రుడు అనే రాక్ష‌సుడిని శివుడు వ‌ధించి మంటల్లో క‌లిపేసాడు. అయితే జ‌లంధ‌రుడి భార్య తుల‌సి. తులసికి మ‌రో పేరు కూడా ఉంది. అదే వృంద‌. తుల‌సి దేవి వ‌ల్లే ఇత‌ర దేవుళ్ల నుంచి ఎలాంటి హాని జలంధ‌రుడికి క‌లిగేది కాదు. తులసి దేవి ప‌విత్ర‌త వ‌ల్లే జ‌లంధ‌రుడికి మ‌ర‌ణం లేదు. దాంతో ఎక్క‌డ తుల‌సి దేవి వ‌ల్ల మ‌ళ్లీ జ‌లంధ‌రుడు బ‌తికి వ‌స్తాడో అని విష్ణుమూర్తి జలంధరుడి వేషంలో తుల‌సి దేవి వ‌ద్ద‌కు వెళ్తారు. దాంతో ఆమె తన భ‌ర్తే త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌నుకుని మోస‌పోతుంది. ఆ త‌ర్వాత విష‌యం తెలిసి కోపంతో శివ‌య్య‌కు త‌న ద‌ళాల‌తో ఎలాంటి పూజ‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌ని శాపం పెడుతుంది. అప్ప‌టి నుంచి శివ‌య్య‌ను తుల‌సి ద‌ళాల‌తో పూజించ‌డంలేదు. ఇప్ప‌టికీ ఈ ఆచారం కొన‌సాగుతోంది.

చంపా, కేవ‌డా పువ్వులు (Champa, Kewda Flowers)

చంపా, కేవ‌డా అనే రెండు ర‌కాల పువ్వుల‌ను కూడా శివ‌య్య‌కు స‌మ‌ర్పించకూడ‌దు. ఈ రెండు ర‌కాల పువ్వుల‌కు శివ‌య్య శాపం ఉంది. అందుకే శివ‌య్య‌ను పూజించే స‌మ‌యంలో ఈ రెండు ర‌కాల పువ్వుల‌ను మాత్రం అస్స‌లు వాడ‌కండి.

కొబ్బ‌రి నీళ్లు (Coconut Water)

కొబ్బ‌రి నీళ్ల‌ను కూడా శివ‌య్యకు స‌మ‌ర్పించ‌కూడ‌దు. ఇక్క‌డ చిన్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. కొబ్బ‌రి నీళ్ల‌ను శివ‌య్య‌కు నైవేద్యంగా పెట్ట‌చ్చు కానీ కొబ్బ‌రి నీళ్ల‌తో అభిషేకం మాత్రం చేయ‌కూడ‌దు. శివ‌య్య‌కు అభిషేకం చేసేందుకు వాడే ప్ర‌తీ వ‌స్తువు నిర్మాల‌య‌తో స‌మానం. అంటే అతి శుద్ధ‌మైన‌ద‌ని అర్థం. సింపుల్‌గా చెప్పాలంటే విగ్ర‌హాల‌కు అభిషేకం చేసేవాటిని మ‌న‌కు ప్ర‌సాదంగా పెడ‌తారు. కానీ శివ‌య్య‌కు అభిషేకం చేసే ఏ వ‌స్తువును కూడా నైవేద్యంగా పెట్ట‌రు. అందుకే కొబ్బ‌రి నీళ్ల‌ను శివ‌య్య అభిషేకానికి వాడ‌రు.

పాడైపోయిన బిల్వ ప‌త్రాలు (Bilwa Leaves)

శివ‌య్య‌కు బిల్వ ప‌త్రాలంటే ఎంత ఇష్ట‌మో ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు. మూడు ఆకులుగా ఉండే బిల్వ పత్రాల‌ను శివ‌య్య‌కు స‌మ‌ర్పిస్తే ఎంతో పుణ్యం. కానీ పురుగులు తినేసిన బిల్వ ప‌త్రాల‌ను, వాడి, కుళ్లిపోయిన ప‌త్రాల‌ను కానీ రెండు ఆకులుగా ఉన్న‌వి కానీ స‌మ‌ర్పించ‌డం మంచిది కాదు. ఆకుల‌ను తుంచి కూడా స‌మ‌ర్పించకూడ‌దు. మీకు తాజా బిల్వ పత్రాలు మూడు ఉన్న‌వి దొరికేతేనే వాటితో పూజించండి. లేక‌పోతే వ‌ద్దు.

ప‌సుపు, కుంకుమ‌ (Turmeric, Saffron)

ప‌సుపును కూడా శివ‌య్య‌కు వినియోగించ‌ర‌ట‌. ఎందుకంటే ఆయ‌న జీవితంలో అన్నీ వ‌దిలేసుకున్న‌వాడు. పసుపు కుంకుమ‌లు ఆడ‌దానికి ఐదో త‌నంతో స‌మానం కాబ‌ట్టి ఆయ‌న‌కు ఇవి అస్స‌లు వాడ‌కూడద‌ట‌.

కంచు గిన్నెలు (Bronze Utensils)

శివయ్య‌కు కంచు గిన్నెల్లో పాలు, పెరుగు వంటివి స‌మ‌ర్పించ‌డం అస్స‌లు మంచిది కాద‌ట‌. కంచు గిన్నెల్లో శివ‌య్య‌కు ఏది స‌మ‌ర్పించినా కూడా అది మ‌ద్యంతో స‌మానం అట‌. ఆయ‌న‌కు వాడాల్సింది కేవ‌లం రాగి పాత్ర‌లు మాత్ర‌మే.