పుదీనా ఆరోగ్యానికి చేసే మేలెంతో తెలుసా!

ఎండాకాలంలో ఒంటికి చలువ చేసే ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఇవి శరీరంలోని వేడిని తగ్గించి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. చలువ చేసే ఆహారాల్లో పుదీనా ఒకటి. అన్నివేళలా అందుబాటులో ఉండే పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా పుదీనాను వివిధ ర‌కాల మాంసాహార‌, శాఖాహార వంట‌కాల్లో వినియోగిస్తుంటాం. వంట‌ల్లోనేగాక టీ, సలాడ్స్‌, మజ్జిగ, వివిధ రకాల జ్యూస్‌లలో కూడా పుదీనాను వాడుతుంటాం. పుదీనాను యాడ్‌ చేయడం ద్వారా వివిధ ర‌కాల పదార్థాలకు చక్కని వాసనతోపాటు రుచి కూడా వ‌స్తుంది. పైగా పుదీనాలో తక్కువ పరిమాణంలోనే ఎక్కువ పోషకాలుంటాయి. మరి పుదీనాతో కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

*వేసవి కాలంలో పుదీనాను ఎక్కువగా వినియోగించడం ఆరోగ్యానికి చాలా మంచిది. పుదీనా ఆకులు వేసిన చల్ల తాగడంవల్ల ఒంట్లో వేడి తగ్గిపోతుంది. వడదెబ్బ లాంటి సమస్యల బారినపడకుండా కాపాడుతుంది. గుప్పెడు పుదీనా ఆకుల్లో ఒక‌రోజు మొత్తానికి కావాల్సిన‌ విటమిన్‌-ఎ లో పది శాతం లభిస్తుందట. కాబట్టి కళ్ల ఆరోగ్యానికి కూడా పుదీనా మంచి ఔషధంగా పనిచేస్తుంది.
*పుదీనాలో విటమిన్ A, Cతో పాటు బి-కాంప్లెక్స్ అధికంగా ఉంటాయన్నారు. పుదీనా ఆకులు చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయన్నారు. పుదీనాలో ఉండే మరో ప్రయోజనం ఏంటంటే.. ఐరన్, పొటాషియం, మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్‌ పెరుగుతుందన్నారు. అంతేకాకుండా పుదీనా తరచూ తింటే మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
*నిత్యం ధూమపానం చేసేవారికే కాదు, కాలుష్యంలో తిరిగేవారికి కూడా ఊపిరితిత్తుల వ్యాధులు పొంచి ఉంటాయి. ఊపిరితిత్తులు విష వ్యర్థాలతో నిండిపోతాయి. దీంతో అనేక సమస్యలు వస్తాయి. ప్రతిరోజూ పుదీనాను తీసుకుంటే ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. పుదీనాలోని మెంథాల్ ఊపిరితిత్తులను వదులు చేయడంతో శ్వాస తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.
*చాలా మంది అజీర్తి, గ్యాస్‌ ట్రబుల్‌ లాంటి సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యల పరిష్కారానికి కూడా పుదీనా బాగా ఉపయోగపడుతుంది. చల్లతో కలుపుకునిగానీ, పచ్చడిలా నూరుకునిగానీ పుదీనాను తినడం ద్వారా జీర్ణశక్తి పెరుగుతుంది. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా పుదీనా వేసి కాగబెట్టిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. పేగులు శుభ్రపడటమేగాక, మెదడు చురుకుదనం కూడా పెరుగుతుంది. దాంతో జ్ఞాపకశక్తి బాగా వృద్ధి చెందుతుంది.
* తరచూ పుదీనా ఆకులు నమలడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా నోటి దుర్వాసన నుంచి ఉపశమనం లభిస్తుంది.