Relationship: బ్రేకప్ చెప్పాల‌నుకుంటున్నారా?

Relationship: ప్రేమ‌లో బ్రేక‌ప్ (breakup) అవ్వ‌డం స‌హ‌జ‌మే. కొంద‌రు కోపంగా బ్రేక‌ప్ చెప్పేసుకుని ఎవ‌రి జీవితాలు వారు చూసుకుంటారు. మ‌రికొంద‌రు ఇంట్లో వారు ఒప్పుకోలేద‌నో.. లేక ఇత‌ర కార‌ణాల వ‌ల్ల బ్రేక‌ప్ చెప్పుకుంటూ ఉంటారు. కోపంగా బ్రేక‌ప్ చెప్పేసుకుంటే పెద్ద‌గా బాధ అనిపించ‌దు.

కానీ ఒక‌రంటే ఒక‌రికి ప్రాణం.. విడిచి ఉండ‌లేరు.. అయినా విడిపోక త‌ప్ప‌దు అని తెలిస్తే గుండె ప‌గిలిపోతుంది. ఆ బాధ నుంచి తేరుకోవ‌డం చాలా క‌ష్టం. అయితే కొన్నిసార్లు విడిపోవ‌డమే ఇద్ద‌రికీ మంచిది అనుకున్న‌ప్పుడు ఆ విష‌యాన్ని ఎదుటి వ్య‌క్తికి ఎలా చెప్పాలో తెలీక స‌త‌మ‌త‌మ‌వుతుంటారు. అలాంటి ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్పుడు ఎలా డీల్ చేయాలో తెలుసుకుందాం.

* మీరు మీ పార్ట్‌న‌ర్‌కి బ్రేక‌ప్ చెప్పాల‌నుకుంటే.. వారిని నిశ్శ‌బ్దంగా ఉండే ప్ర‌దేశానికి తీసుకెళ్లండి. అంటే మీ ఇద్ద‌రూ ప్రశాంతంగా ఎలాంటి డిస్ట‌ర్బెన్సెస్ లేకుండా ఉండే ప్ర‌దేశంలో కూర్చోండి.

*ప్రేమ‌లో నిజాయ‌తీ ఎంతో ముఖ్యం. మీరు ఎందుకు బ్రేక‌ప్ చెప్పాల‌నుకుంటున్నారో అర్థ‌మ‌య్యేలా మీ పార్ట్‌న‌ర్‌కు క్లియ‌ర్‌గా చెప్పండి. ఎలాంటి దాప‌రికాలు వ‌ద్దు. మీరు బ్రేక‌ప్ చెప్పాల‌నుకున్న కార‌ణం వ‌దిలేసి ఏవేవో చెప్పారంటే అది మోసం అవుతుంది.

*ఒక‌వేళ మీరు బ్రేక‌ప్ చెప్పాల‌నుకోవ‌డానికి కార‌ణం మీ పార్ట్‌న‌రే అయితే గ‌ట్టిగా అరిచేయ‌డాలు తిట్ట‌డాలు వంటివి అస్స‌లు చేయ‌కండి. నువ్వు నాకు టైం ఇవ్వ‌డంలేద‌ని అర్థ‌మ‌వుతోంది.. మ‌నం ఇక క‌లిసి ఉండ‌టంలో అర్థం లేదేమో.. ఇలాంటి సున్నిత‌మైన ప‌దాల‌ను వాడండి.

*మీరు బ్రేక‌ప్ ఎందుకు చెప్పాల‌నుకుంటున్నారో చెప్పేసిన త‌ర్వాత మీ పార్ట్‌న‌ర్‌కు కూడా మాట్లాడే అవ‌కాశం ఇవ్వండి. వారు ఏం చెప్తారో ఓపిక‌గా వినండి. అప్పుడు మ‌ళ్లీ క‌లిసిపోయే అవ‌కాశం ఉండ‌చ్చు.

*బ్రేక‌ప్ చెప్పే స‌మ‌యంలో ఎవ‌రైనా ఎందుకు ఏంటి అని ఎన్నో ప్ర‌శ్న‌లు అడుగుతారు. వాటికి మీరు నిజాయ‌తీగా స‌మాధానాలు చెప్పాల్సి ఉంటుంది. నా ఇష్టం నాకు నువ్వు ఇష్టం లేదు అని మాట్లాడితే అందులో అర్థం లేదు. దానిని ప్రేమ అని అస‌లు అన‌రు.

*బ్రేక‌ప్ చేసుకోవ‌డం ఇద్ద‌రికీ స‌రైన నిర్ణ‌యం అనిపిస్తే.. ఇప్ప‌టినుంచి స్నేహితులుగా ఉందాం.. ఎప్ప‌టిలాగే మాట్లాడుకుందాం అని అస్స‌లు అన‌కండి. ఒక బంధాన్ని వ‌ద్దు అనుకున్న‌ప్పుడు మ‌ళ్లీ దానిని స్నేహం అనే పేరుతో కొన‌సాగించాల్సిన అవ‌స‌రం లేదు. అది మ‌నిషికి ఇంకా క‌ష్టంగా ఉంటుంది.

గ‌మ‌నిక‌: పైన వివ‌రించిన అంశాలు సైకాల‌జీ నిపుణుల నుంచి సేక‌రించిన‌వి. నిజాయ‌తీగా రెండు జీవితాలు బాగుండాల‌న్న ఉద్దేశంతో బ్రేక‌ప్ చెప్పుకోవాలి అనుకునేవారి కోసం మాత్ర‌మే ప్ర‌చురించ‌బ‌డిన క‌థ‌నం అని తెలుసుకోగ‌ల‌రు.