AP Elections: ఇంట్లోవారి చీత్కారాలా? ప్రజల ఆశీర్వాదాలా?
AP Elections: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. కానీ ఇంట్లో గెలవలేక రచ్చ గెలిచేందుకు సిద్ధమయ్యారు కొందరు రాజకీయ నాయకులు. ఇంట్లో వారు చీదరించుకుంటుంటే.. మరి వీరిని ప్రజలు ఆశీర్వదిస్తారా? సొంతింటి వాళ్లే వారికి ఓటు వేయద్దు అని వేడుకుంటున్నారు. మరి ప్రజలు వారిని నమ్మి గెలిపిస్తారా?
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఈసారి ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పాతాళానికి తొక్కేయాలని అనుకుంటున్నారు. ఇందుకోసం ఎన్డీయే కూటమితో జనసేనతో చేతులు కలిపారు. ఈసారి ఆరు నూరైనా గెలిచి తీరాల్సిందే అన్న పట్టుదలతో ఉన్నారు. ప్రజల్లో తనపై నమ్మకాన్ని పెంచుకుంటూ తన ప్రయత్నం ఏదో తాను చేసుకుంటున్న చంద్రబాబుకు.. తన బంధువు, జూనియర్ ఎన్టీఆర్ మామగారు నార్నె శ్రీనివాస్ రావు నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రస్తుతం ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి ఓటు వేయొద్దని.. సొంత తమ్ముడు, చెల్లిని చూడని వాడు ప్రజలకు ఏం చేస్తాడని ఆయన వీడియో రిలీజ్ చేసారు.
ఇక ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham). జనసేనాని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన వద్దకు వస్తేనే పార్టీలోకి వస్తానని డైలాగులు కొట్టిన ముద్రగడ చివరకు వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనకు పవన్‌ను తిట్టే శాఖ కేటాయించినట్లున్నారు. ఆయన ఏ ప్రెస్‌మీట్ పెట్టినా పవన్ కళ్యాణ్‌ను తిట్టకుండా ఉండలేరు. అలాంటి ఆయనకు కన్న కూతురు క్రాంతి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్‌ను తిట్టేందుకే తన తండ్రిని వైఎస్సార్ పార్టీ చేర్చుకుందని ఎన్నికలు అయ్యాక ఆయన్ను పక్కన పడేస్తారని.. తన మద్దతు మాత్రం ఎన్డీయే కూటమికే అని క్రాంతి చెప్పడంతో అంతా కంగుతిన్నారు. దాంతో ముద్రగడకు కోపం వచ్చి అసలు తన కూతురు తన ప్రాపర్టీ కాదని ఆమెకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసారు.
సొంత అన్న జగన్ మోహన్ రెడ్డితో (Jagan Mohan Reddy) పాటు ఇంట్లో వారి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేత వైఎస్ షర్మిళ (YS Sharmila). అన్నతో గొడవ ఎందుకులే అని తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిళ.. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలిపి కేసీఆర్‌ను గద్దె దించేవరకు పోరాడింది. ఆ తర్వాత ఏపీలో అడుగుపెట్టింది. ఏపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని ఇప్పుడు సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై గెలిచేందుకు కడప ఎంపీగా పోటీ చేస్తోంది. ఈ విషయంలో షర్మిళకు ఆమె భర్త, తల్లి, సోదరి సునీతా రెడ్డిల సపోర్ట్ తప్ప ఇంకెవ్వరూ సపోర్ట్ చేయడంలేదు.
ఇక చివరగా వైఎస్సార్ కాంగ్రెస్ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) ఈ జాబితాలో చేరారు. ఆయన సొంత అల్లుడు గౌతమ్ నిన్న ఓ వీడియో రిలీజ్ చేస్తూ.. అంబటి రాంబాబు శవాలపై పేలాలు ఏరుకునే వ్యక్తని అతనికి ఓటేస్తే సంకనాకిపోతారని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. దాంతో అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి తన కూతురు అల్లుడు విడిపోయారని.. ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఎన్డీయే కూటమి నేతలు తన అల్లుడిని తనపైకి ఉసిగొల్పారని ఆయన విమర్శలు గుప్పించారు.