AP Elections: వాలంటీర్లకు ఎన్నికల సంఘం హెచ్చరిక.. దొరికితే జైలుకే
AP Elections: గత ఎన్నికల్లో YSRCP తాము నియమించుకున్న వాలంటీర్లతో కుట్ర చేయించి మరీ అధికారంలోకి వచ్చిందని ఇప్పటికే పలుమార్లు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆరోపించారు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలు దగ్గరుపడుతుండగా.. కొన్ని నెలల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి వాలంటీర్ల వ్యవస్థ గురించి ఫిర్యాదు చేసారు. దీంతో.. మొన్న ఎన్నికల తేదీలను ప్రకటించే సమయంలోనే కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వాలంటీర్లను పోలింగ్ సమయాల్లో కానీ ఓటింగ్ సమయాల్లో కానీ వినియోగించుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది.
అయినా కూడా YSRCP వాలంటీర్లను యథేచ్ఛగా ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటోంది. దాంతో కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే స్పందించి యాక్షన్ తీసుకోవాలని ప్రతిపక్షాలు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క ఎన్నికలకు సంబంధించి ఏ అంశంలోనూ వాలంటీర్లు ఉండటానికి వీల్లేదని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లు జోక్యం చేసుకుంటున్నట్లు తెలిస్తే అరెస్ట్ చేయాల్సి వస్తుందని కూడా హెచ్చరించినట్లు సమాచారం. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా కూడా వైసీపీ సరిగ్గా పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడుతోంది.
అయితే వాలంటీర్లకు ప్రభుత్వంతో ఏ సంబంధం లేదన్నట్లుగా రుజువు చేసే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా వాలంటీర్లకు ఇచ్చిన ప్రభుత్వ సిమ్ కార్డులను వెనక్కి తీసేసుకుంటోంది. వైసీపీ అభ్యర్ధులు ప్రచారానికి వెళ్తే వారితో పాటు ఆ ప్రాంతానికి చెందిన వాలంటీర్లు కూడా విచ్చలవిడిగా తిరిగేస్తున్నారు. మరి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.