Kidney Transplant: పంది కిడ్నీ పనిచేస్తుందా? మానవ కిడ్నీ కంటే బెటరా?
Kidney Transplant: కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేయించుకోవాలంటే చాలా కాలం పాటు పేషెంట్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి. అలా కాకుండా మనిషి కిడ్నీ కాకుండా పంది కిడ్నీని పెట్టి చూస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఇదే అంశంపై రీసెర్చ్ జరుగుతోంది. అమెరికాకు చెందిన రిచర్డ్ అనే 62 ఏళ్ల వ్యక్తికి రెండు కిడ్నీలు పోతే పంది కిడ్నీ పెట్టి సర్జరీ చేసారు. అయితే నేరుగా పంది నుంచి కిడ్నీ తీసి రిచర్డ్ పెట్టలేదు. ఇందుకు చాలా జీన్ మాడిఫికేషన్స్ జరిగాయి. అసలు ఈ పంది కిడ్నీ మార్పిడి ఏంటో క్లుప్తంగా తెలుసుకుందాం.
జీన్ మాడిఫికేషన్ అంటే ఏంటి?
పందుల్లో ఒక రకమైన షుగర్ ఉంటుంది. అందుకే వాటి నుంచి మనిషికి ఏది సోకినా అది అనారోగ్యానికి దారి తీస్తుంది. ఇందుకోసం పంది కిడ్నీకి జీన్ మాడిఫికేషన్ (జన్యుపరమైన సవరణలు) చేసి మనిషికి వాటి కిడ్నీ సరిపోయేలా చేస్తారు. రెండో విషయం ఏంటంటే.. ఇతర జంతువుల అవయవాలను మనుషులకు అమరిస్తే రక్తం గడ్డ కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల అవయవానికి రక్త ప్రసరణ జరగదు. ఇలా జరగకుండా ఉండేందుకు వైద్యులు జన్యుపరమైన సవరణలు చేస్తారు. పందుల్లో ఉండే వైరస్‌లను కూడా ఈ జన్యు సవరణల ద్వారా తొలగించి అప్పుడు అవయవ మార్పిడి చేస్తారు.పందుల కిడ్నీలో ఇలాంటి జన్యు సవరణలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 69 సార్లు చేసారు. (Kidney Transplant)
పందుల అవయవాలు సబబేనా?
జంతువుల అవయవ మార్పిడిలో భాగంగా శాస్త్రవేత్తలు పందుల్నే ఎందుకు ఎంచుకున్నారంటే.. వీటి అవయవాల పనితీరు మనుషుల అవయవాల పనితీరుతో సమానంగా ఉంటాయి. అలాగని పంది అవయవాలు మనిషికి బాగా పనిచేస్తాయని చెప్పలేం. ఎందుకంటే పందుల్లో ఉండే వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా సులువుగా సోకుతుంది. కాబట్టి ఇంకా దీనిపై రీసెర్చ్ జరుగుతోంది.
పంది కిడ్నీతో ఎంత కాలం బతికే అవకాశం ఉంది?
పంది కిడ్నీ మార్పిడితో ఓ మనిషి దాదాపు రెండేళ్ల పాటు బతికే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. ఇటీవల ఇద్దరు పేషెంట్లకు పందుల గుండెలతో గుండె మార్పిడి చికిత్స చేసామని కానీ వారిద్దరూ కొంత కాలానికే చనిపోయారని తెలిపారు. అయితే పందులనే నమ్ముకోకుండా స్టెమ్ సెల్స్ ద్వారా ల్యాబ్‌లలో అవయవాలను తయారుచేసే ప్రక్రియపై కూడా రీసెర్చ్‌లు జరుగుతున్నాయి.
పెరుగుతున్న కిడ్నీ మార్పిడి కేసులు
జీవనశైలిలో మార్పులు.. ఒత్తిడి వల్ల కలిగే బీపీ, డయాబెటిస్ కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు ఎక్కువ అయిపోతున్నాయి. ఫలితంగా కిడ్నీ మార్పిడి కేసులు కూడా ఎక్కువ అవుతున్నాయి. కానీ కిడ్నీ దానం చేసేవారి సంఖ్య తగ్గుతోంది. దాంతో శాస్త్రవేత్తలు పందుల కిడ్నీపై రీసెర్చ్ చేస్తున్నారు.