Sleep: సోఫాపై వచ్చిన నిద్ర మంచంపై ఎందుకు రాదు?
Sleep: మీరెప్పుడైనా గమనించారా? సోఫాపై అలా వాలగానే నిమిషాల్లో నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అదే నిద్ర మంచంపై పడుకుంటే మాత్రం రాదు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఏమన్నా కారణాలు ఉన్నాయా? తెలుసుకుందాం.
రోజంతా మేల్కొని ఉంటాం కాబట్టి మన శరీరంలో ఎడినోసైన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. అది విడుదల కాగానే నిద్రపోవాలంటూ శరీరం మనపై ఒత్తిడి తెస్తుంది. మనం అలిసిపోయి ఉన్నప్పుడు అలా సోఫాపై కూర్చోగానే ఈ ఎడినోసిన్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఫలితంగా సోఫాపైనే కోమాలోకి వెళ్లినట్లు నిద్రపోతుంటారు. నిద్రపోయి లేచాక కానీ తెలీదు నిద్రపట్టేసిందని. అదే మ్యాజిక్.
కొందరు టీవీ చూస్తూ కూడా సోఫాపై నిద్రలోకి జారుకుంటూ ఉంటారు. సోఫా శరీరానికి మెత్తగా తగులుతూ హాయిగా ఉంటుంది. టీవీ నుంచి వెలువడే చిన్న శబ్దాల వల్ల మైండ్ వేరే ఆలోచనల్లోకి వెళ్లిపోయి నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. సాధారణంగానే మన శరీరంలోని గడియారం ఒక సమయంలో నిద్రలోకి జారుకునేలా చేస్తుంది. కొందరికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. మరికొందరికి సాయంత్రం. ఆ సమయం రాగానే సోఫాపై కూర్చుని ఉన్నామంటే మరింత గాఢ నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. సోఫాలో నిద్రపోవడం ఎందుకు మంచంపై పడుకోపో అని ఎవరైనా లేపితే ఇక ఆ నిద్ర మళ్లీ పట్టదు.