Egg Diet అంటే ఏంటి.. మంచిదేనా?

రోజుకో గుడ్డు ఆరోగ్యంగా ఎంతో మంచిది అంటుంటారు. జిమ్, హెవీ వ‌ర్క‌వుట్స్ చేసేవారైతే నాలుగు గుడ్లు అలా తినేస్తుంటారు. అయితే.. రోజంతా ఎగ్ డైట్ (egg diet) చేస్తే ఏమ‌వుతుంది? అస‌లు ఈ ఎగ్ డైట్ అంటే ఏంటి? ఎవ‌రు చేస్తే మంచిది.. వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం.

ఎగ్ డైట్ అంటే ఏంటి?

మ‌నం రోజంతా తినే ఆహారంలో ఎక్కువ భాగం ఎగ్స్ ఉంటే దానిని ఎగ్ డైట్ (egg diet) అంటారు. దీని వ‌ల్ల ఎక్కువ ప్రొటీన్, త‌క్కువ కేలొరీలు అందుతాయి. కండ‌రాలు క‌రిగిపోకుండా కేవ‌లం బ‌రువు త‌గ్గించ‌డంలో ఈ ఎగ్ డైగ్ బాగా ఉప‌యోగ‌ప‌డుతుంద‌ట‌. ఎగ్ డైట్‌లో రెండు ర‌కాలు ఉంటాయి. ఒక‌టి కేవ‌లం ఉడ‌క‌పెట్టిన గుడ్ల‌ను తిన‌డం. రెండోది గుడ్ల‌తో ర‌క‌ర‌కాల వంట‌లు చేసుకుని తిన‌డం. వీటిలో ఏ డైట్ చేయాల‌నుకున్నా కూడా కేవ‌లం నీళ్లు తాగాలే త‌ప్ప కేలొరీలు ఎక్కువ‌గా ఉండే డ్రింక్స్ అస్స‌లు తీసుకోకూడ‌దు. ఎగ్స్‌తో పాటు గ్రిల్డ్ చికెన్, చేప‌లు, ఉడ‌క‌బెట్టిన కూర‌గాయ‌లు తీసుకోవ‌చ్చు.

ఆల్ ఎగ్ డైట్ వ‌ద్దంటున్న డాక్ట‌ర్లు

గుడ్లు తిన‌డం ఆరోగ్యానికి ఎంత మంచిది అయిన‌ప్ప‌టికీ ఆల్ ఎగ్ డైట్ (egg diet) అంటే రోజంతా ఎగ్స్ తింటూ బ‌రువు త‌గ్గాలి అనుకుంటే మాత్రం మంచిది కాద‌ని డాక్ట‌ర్లు చెప్తున్నారు. ఎందుకంటే కేవ‌లం ఎగ్స్ తీసుకుంటూ ఉండే బ‌రువు త‌గ్గ‌డం మాట అటుంచితే.. మిగ‌తా పోష‌కాలు శ‌రీరానికి అంద‌క ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. బ‌రువు త‌గ్గ‌డం అంటే ఒంట్లో కొవ్వు కరిగించుకోవ‌డం మాత్ర‌మే కాదు. శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం కూడా. మ‌రో విష‌యం ఏంటంటే.. ఆల్ ఎగ్ డైట్ చేసేవారు త్వ‌ర‌గా స‌న్న‌బ‌డుతూ వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రావ‌డ‌మే కాదు.. ఆ త‌ర్వాత కూర‌గాయ‌లు, మాంసం, పండ్లు లాంటివి తినాల్సిన స‌మ‌యం వ‌చ్చినా కూడా సహించ‌వ‌ట‌. ఇది అత్యంత ప్ర‌మాద‌మ‌ని హెచ్చ‌రిస్తున్నారు. (egg diet)

గుడ్డు సొన మంచిదేనా?

చాలా మంది ఎగ్ వైట్స్ తినేసి ప‌చ్చ సొన వ‌దిలేస్తుంటారు. దాని వ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంద‌ని భ‌య‌ప‌డుతుంటారు. నిజానికి కేవ‌లం ఆల్ ఎగ్ డైట్ చేయాల‌నుకునేవారు ఈ విష‌యంలో ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే స‌గ‌టు మ‌నిషి రోజుకి రెండు ఫుల్ ఎగ్స్ తింటే ఎంతో మంచిది. కానీ రోజంతా ఎగ్స్ తినేవారు ప‌చ్చ సొనను కూడా తినేస్తుంటే మాత్రం కొలెస్ట్రాల్‌పై ప్ర‌భావం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ట‌. ముఖ్యంగా ఆల్రెడీ కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఇంకా జాగ్ర‌త్త‌గా ఉండాలి.