Health: కాఫీ, వ్యాయామం లేకపోతే అకాల మరణం తప్పదా?
Health: కాఫీ తాగకపోయినా.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోయినా అకాల మరణ అవకాశం 60 శాతం ఎక్కువగా ఉంటుందట. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన బయోమెడ్ సెంట్రల్ (BMC) ప్రచురించింది. దాదాపు 13 ఏళ్లుగా 10 వేల మందితో ఈ సంస్థ సర్వేలు చేపడుతోంది. కాఫీ తాగుతూ.. వ్యాయామం చేసేవారితో పోలిస్తే అసలు కాఫీ తాగకుండా ఆరు గంటల పాటు అలాగే కూర్చుని పనిచేసే వారిలో అకాల మరణ ముప్పు 60 శాతం ఎక్కువగా ఉందట.
కాఫీ తాగేవారితో పోలిస్తే కాఫీ తాగని వారిలో అకాల మరణ ముప్పు 33% ఉన్నట్లు కూడా గుర్తించింది. కాఫీ తాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందట. దీని వల్ల జీవనశైలి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉంటారని ఆ సంస్థ చేపట్టిన సర్వేలో తేలింది. రోజులో 8 గంటల కంటే ఎక్కువగా అలాగే కూర్చుని ఉండేవారిలో ఏ కారణంగానైనా మరణం సంభవించే అవకాశం 40% ఎక్కువగా ఉంటుంది. వీరిలో 80% మంది గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే చనిపోతున్నారు.
నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే (NHANES) నుంచి సేకరించిన నివేదిక ద్వారా ఈ పరిశోధనను చేపట్టారు. అయితే కాఫీ వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనే అంశంపై మాత్రం క్షేత్ర స్థాయిలో పరిశోధనలు చేపడుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. కాఫీ ఎక్కువగా తాగితే మాత్రం అనారోగ్య సమస్యలు తప్పవని గుర్తుంచుకోవాలి.