Pain Killers: నెల‌స‌రి నొప్పులకు పెయిన్ కిల్ల‌ర్స్ వాడాలా వ‌ద్దా?

Pain Killers: నెల‌స‌రి (period cramps) స‌మ‌యంలో క‌డుపులో తిప్పేస్తున్న‌ట్లు భ‌రించ‌లేని నొప్పి వ‌చ్చేస్తుంది. అది అనుభ‌వించేవారికే తెలుస్తుంది. కొంద‌రు ఆ నొప్పుల‌ను త‌ట్టుకోగ‌లుగుతారు కానీ మ‌రికొంద‌రైతే నిస్స‌హాయ స్థితిలో పెయిన్ కిల్ల‌ర్స్ వేసేసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ పెయిన్ కిల్ల‌ర్స్ వాడాలా వ‌ద్దా అనే చ‌ర్చ మొద‌లైంది. ఎందుకంటే ఇటీవ‌ల ఓ అమ్మాయి ఇలాగే పెయిన్ కిల్ల‌ర్ వేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తం గ‌డ్డ క‌ట్టి కోమాలోకి వెళ్లి చ‌నిపోయింది. అందుకే పెయిన్ కిల్ల‌ర్స్ విష‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు చెప్తున్నారు.

నెల‌స‌రి స‌మ‌యంలో యోని భాగంలో ఉండే ఎండోమెట్రియం అనే పొర చినిగిపోతుంది. ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్ వ‌ల్ల ఈ పొర చిరుగుతంది. దాని వ‌ల్లే నెల‌స‌రి వ‌చ్చిన రెండు రోజుల పాటు పొత్తి క‌డుపులో విప‌రీత‌మైన నొప్పి ఉంటుంది. నొప్పులు సాధార‌ణ‌మే కానీ మ‌రీ భ‌రించలేనంత నొప్పి ఉంటే మాత్రం ప్రోస్టాగ్లాండిన్స్ హార్మోన్ ఎక్కువ‌గా ఉంద‌ని అర్థం. పెయిన్ కిల్ల‌ర్స్ వేసుకోవ‌డం వ‌ల్ల ప్ర‌మాద‌మేమీ లేదు కానీ మ‌రీ ప‌నులు చేసుకోలేనంత నొప్పి ఉన్న‌ట్లైతే త‌ప్ప‌కుండా గైన‌కాల‌జిస్ట్‌ను సంప్ర‌దించాల్సిందే. పెయిన్ కిల్ల‌ర్స్ కూడా ఏవి ప‌డితే అవి కాకుండా వైద్యుల‌ను అడిగే తీసుకోవ‌డం బెట‌ర్.

డోసేజ్ కూడా ముఖ్య‌మే. సాధార‌ణంగా నెల‌స‌రి నొప్పుల‌కు ఇబుప్రోఫెన్ 200 ఎంజీ ఇస్తారు. ఒక ట్యాబ్లెట్ వేసుకున్నాక‌ ఎనిమిది గంట‌ల గ్యాప్‌లో ఇంకోటి వేసుకోవ‌చ్చు. అయితే మూడు నాలుగు ట్యాబ్లెట్లు అని కొనసాగిస్తే ప్ర‌మాదం. అది కూడా క‌డుపు నిండా తిన్నాకే ఈ ట్యాబ్లెట్లు వేసుకోవాలి. లేదంటే జీర్ణాశ‌య స‌మ‌స్య‌లు వ‌స్తాయి.