Meditation: ధ్యానంతో అనారోగ్య సమస్యలు.. షాకింగ్ సర్వేలు
Meditation: ధ్యానం అనే పదం వినగానే ప్రశాంతత గుర్తొస్తుంది. ఎవరైనా కోపంలో ఉన్నా చిరాగ్గా ఉన్నా కాసేపు ధ్యానం చేస్తే మనసు మళ్లీ మామూలు స్థితికి చేరుతుంది అంటుంటారు. ధ్యానం అనేది ఇప్పటి కళ కాదు. వేల సంవత్సరాల క్రితం మహర్షులు, రుషులు చేసేవారు. ఇప్పుడు ఈ ధ్యానాన్ని యోగాలో ఒక భాగంగా భావిస్తున్నారు. అలాంటి ధ్యానం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటే నమ్ముతారా?
మన నమ్మకాన్ని పక్కన పెడితే.. నిజానికి ఇప్పుడున్న మోడ్రన్ పరిశోధకులు మనకు ధ్యానం అనేది మనిషి జీవితాన్ని మార్చేస్తుందని.. అంతా పాజిటివ్‌గా ఉంటుందని.. ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని చెప్తూ వచ్చారు. మనం కూడా నమ్ముతూ వచ్చాం. నిజానికి ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వల్ల మానసిక సమస్యలు వస్తాయన్న సంగతి తెలుసా? ఈ విషయాన్ని పురాతన కాలాల్లో జరిగిన పరిశోధనలే చెప్పాయి. ధ్యానం చేసే వారిలో కొందరికి డిప్రెషన్, యాంగ్జైటీ, సైకోసిస్ వంటి రుగ్మతలు కనిపించాయట. ఈ లక్షణాలు దాదాపు నెల రోజుల పాటు ఉండేవని చెప్పారు.
2022లో అమెరికాలో 900 మందితో ఈ ధ్యానానికి సంబంధించిన సర్వే చేయగా.. వారిలో 10 శాతం మందికి మానసిక సమస్యలు వచ్చాయని తేలింది. దాంతో గత ఐదేళ్లలో ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి పరిశోధనలు ఎక్కవయ్యాయి. భారతదేశంలో జాతకాలు అనేవి ఎన్ని కోట్ల వ్యాపారమో.. అమెరికాలో ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ అనే అంశాలకు సంబంధించిన బిజినెస్ విలువ 2.2 బిలియన్ డాలర్లు. అంటే ఈ ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ పేరుతో ప్రజల్ని దోచేసుకుంటున్నారు.
ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనే అంశంపై చాలా కాలంగా రీసెర్చ్ చేస్తున్న జాన్ కబాట్ జిన్ అనే వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ అంశాలపై ఇప్పటివరకు వచ్చిన పాజిటివ్ నివేదికల్లో నిజం లేదని.. అవి నామమాత్రంగా చెప్పినవి మాత్రమే అని అన్నారు. ఇక్కడ ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ వల్ల అన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్పడం లేదు. ఈ రెండు గొప్ప విషయాలే. కాకపోతే వీటి వల్ల కూడా మానసిక అనారోగ్య సమస్యలు వస్తాయని ఎవ్వరూ చెప్పడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
99 శాతం మంది ఇన్‌ఫ్లుయెన్సర్లు, మెడిటేషన్ చేసేవారు వీటి వల్ల కలిగే హాని గురించి ప్రజలకు చెప్పకుండా 100 శాతం పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని నమ్మిస్తున్నారు. ఇప్పటికీ మెడిటేషన్ ఎలా చేయాలి అనే అంశంపై ఇంకా రీసెర్చ్ తొలి దశల్లోనే ఉంది. ఒకవేళ ధ్యానం, మైండ్‌ఫుల్‌నెస్ ద్వారా మీరు మీ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలనుకుంటే దాని వల్ల కలిగే మానసిక అనారోగ్య సమస్యల గురించి కూడా అవగాహన కలిగి ఉండాలి.