Eye Health: సైట్ పోవాలంటే ఏ స‌ర్జ‌రీలు బెస్ట్?

Eye Health: ఈ మ‌ధ్య‌కాలంలో సైట్ ఉంటే అద్దాలు పెట్టుకోవాల‌ని ఎవ్వ‌రూ అనుకోవ‌డంలేదు. ముఖ్యంగా యువ‌త‌. స్టైల్ కోసం పెట్టుకుంటారు కానీ సైట్ ఉన్న అద్దాలు మాత్రం వ‌ద్దు అంటున్నారు. అద్దాల‌కు బ‌దులు ఇప్పుడు ఎన్నో ఆధునిక చికిత్స‌లు అందుబాటులో ఉండ‌డంతో వాటికే మొగ్గు చూపుతున్నారు. లేదా కాంటాక్ట్ లెన్సులు పెట్టుకుంటున్నారు. ప‌దేళ్ల క్రితం వ‌ర‌కు కంటి చూపును బాగు చేసేందుకు లేజ‌ర్, లాసిక్ చికిత్స‌లు మాత్ర‌మే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఎన్నో చికిత్స‌లు వ‌చ్చేసాయి. వాటిలో ఈ ఐదు బెస్ట్ అంటున్నారు కంటి నిపుణులు. అవేంటంటే..

లాసిక్

దీనినే లేజ‌ర్ ఇన్‌సిటూ కెరాటోమైల్యూసిస్ అంటారు. ఇది ప‌దేళ్ల క్రిత‌మే అందుబాటులోకి వ‌చ్చింది. ఫేమ‌స్ కంటి స‌ర్జ‌రీల్లో ఈ లాసిక్ ఒక‌టి. ఈ స‌ర్జ‌రీలో ఎలాంటి బ్లేడ్లు వంటివి ఉప‌యోగించ‌రు. 5 నుంచి 25 క్ష‌ణాల్లోనే ఈ స‌ర్జ‌రీ పూర్తైపోతుంది. ఈ స‌ర్జ‌రీని మ‌యోపియా, ప్రెస్ బ‌యోపియా, ఆస్టిగ్మాటిజం ఉన్న‌వారికి చేస్తారు. 18 ఏళ్లు నిండిన వారికే ఈ స‌ర్జ‌రీలు చేస్తారు.

ఈ స‌ర్జ‌రీ చేసిన మ‌రుస‌టి రోజు నుంచే అన్ని ప‌నులు చేసుకోవ‌చ్చు. కాక‌పోతే నిప్పు జోలికి, గ్యాస్ స్ట‌వ్ జోలికి మాత్రం వెళ్లొద్దు. పూర్తిగా న‌యం కావ‌డానికి 2 నుంచి 3 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. (Eye Health)

స్మైల్

స్మైల్ అలియాస్ స్మాల్ ఇన్‌సిష‌న్ లెంటిక్యూల్ ఎక్స్‌ట్రాక్ష‌న్‌. 22 నుంచి 42 ఏళ్ల వ‌య‌సు వారికి అందులోనూ మ‌యోపియా, అస్టిగ్మాటిజంతో బాధ‌ప‌డుతున్న వారికి ఈ స‌ర్జ‌రీ చేస్తారు. ఈ స‌ర్జ‌రీ పూర్తికావ‌డానికి 10 నుంచి 15 నిమిషాలు ప‌డుతుంది. ఈ స‌ర్జ‌రీ పూర్త‌య్యాక పూర్తిగా కోలుకోవ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. స‌ర్జ‌రీ అయిన రెండు రోజుల వ‌ర‌కు అస‌లు కంప్యూట‌ర్ చూడ‌టానికి, పుస్త‌కాలు చ‌ద‌వడానికి వీల్లేదు. క‌ళ్ల‌కు నీళ్లు త‌గలాలంటే కూడా 2 రోజుల స‌మ‌యం ప‌డుతుంది. ఈత కొట్టాలన్నా ఇత‌ర అవుట్‌డోర్ గేమ్స్ ఆడాల‌న్నా కూడా 6 వారాలు ఆగాలి. క‌ళ్ల‌కు వారం రోజుల పాటు ఎలాంటి కాటుక, మేక‌ప్ వేయ‌కూడ‌దు.

సిల్క్

సిల్క్ అలియాస్ స్మూత్ ఇన్‌సిష‌న్ లెంటిక్యూల్ కెరాటోమైల్యూసిస్. ఇది స్మైల్ స‌ర్జ‌రీ లాగే ఉంటుంది. లాసిక్, స్మైల్ క‌న్నా ఈ ప్ర‌క్రియ ఇంకా బెట‌ర్ ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ట‌. ఈ చికిత్స చేసుకోవ‌డం ద్వారా 6/5 విజ‌న్ ఉంటుంద‌ట‌. అంటే షార్ప్ విజ‌న్ ఉంటుంది. 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు వారికి చేస్తారు. మ‌యోపియా, అస్టిగ్మాటిజం ఉన్న‌వారికి ఈ సిల్క్ స‌ర్జ‌రీ ప‌నిచేస్తుంది. స‌ర్జ‌రీ అయిన 24 గంట‌ల్లోనే అన్ని ప‌నులు చేసుకోవ‌చ్చు. ఒక‌వేళ స్టైల్ కోసం లెన్స్ పెట్టుకోవాలంటే త‌ప్ప‌కుండా రెండు వారాలు ఆగాలి. స్విమ్మింగ్ చేయాల‌న్నా వేడి నీళ్ల‌తో స్నానం చేయాల‌న్నా ఒక వారం పాటు ఆగాల్సిందే.

ఫోటో రిఫ్రాక్టివ్ కెరాటెక్టోమీ (PRK)

ఇది ఒరిజిన‌ల్ లేజ‌ర్ స‌ర్జ‌రీ టెక్నిక్. లాసిక్ చేయ‌లేని వారికి ఈ స‌ర్జ‌రీ చేస్తారు. 18 ఏళ్లు పై బ‌డిన వారికి చేస్తారు. పూర్తిగా కోలుకోవ‌డానికి 4 వారాల నుంచి 4 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. స‌ర్జ‌రీ అయిన వారం రోజుల త‌ర్వాత కంటికి ఉన్న బ్యాండేజ్ తీసేస్తారు. బ్యాండేజ్ తీసిన త‌ర్వాత క‌ళ్లు వెలుతురును చూడ‌టానికి 10 రోజులు ప‌డుతుంది.

రిఫ్రాక్టివ్ లెన్స్ ఎక్స్‌చేంజ్ (RLE)

ఈ స‌ర్జ‌రీ ద్వారా 20/20 చూపు మెరుగుప‌డుతుంది. అల్ట్రా సౌండ్ ద్వారా స‌ర్జ‌రీ చేస్తారు. దీనిని 40 నుంచి 50 ఏళ్లు మ‌ధ్య వ‌య‌సు వారికి చేస్తారు. ఈ స‌ర్జ‌రీ నుంచి పూర్తిగా కోలుకోవ‌డానికి 8 వారాల నుంచి కొన్ని నెల‌లు ప‌డుతుంది. రెండు క‌ళ్ల‌కు క‌లిపి గంట సేపు స‌ర్జ‌రీ ఉంటుంది.

ఇవి భార‌త్‌లో ఉన్న ఫేమ‌స్ కంటి స‌ర్జ‌రీలు. వీటి ధ‌ర‌లు వివిధ ప్రాంతాల్లో వివిధ ర‌కాలుగా ఉంటాయి. అందుకే ధ‌ర‌ల గురించి వివ‌రించ‌లేదు. మీరు సైట్ రిడ‌క్ష‌న్ స‌ర్జ‌రీలు చేయించుకోవాల‌నుకుంటే క‌చ్చితంగా కంటి నిపుణుల‌ను సంప్ర‌దించాల్సిందే. వారు ఏది సూచిస్తే దానికి వెళ్ల‌డం బెట‌ర్. పై వివ‌రాలు స‌మాచారం కోసం మాత్రమే ఇచ్చాం. ఇలాంటి అంశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే వైద్యుల‌ను సంప్ర‌దించడం 100 శాతం బెట‌ర్.