Black: శుభ‌కార్యాలకు న‌లుపు ఎందుకు ధ‌రించ‌కూడ‌దు? ధ‌రిస్తే ఏమ‌వుతుంది?

Black: న‌లుపు రంగు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. న‌లుపు రంగులో ఎలాంటివారైనా చాలా అందంగా క‌నిపిస్తారు. న‌లుపుకి ఉండే క్రేజే వేరు. చ‌ర్మ రంగు న‌లుపులో ఉంటే ఎవ్వ‌రికీ న‌చ్చ‌దు కానీ దుస్తులు, వాచీలు వంటివి న‌లుపు రంగులో ఉంటే వాటి కోసం ఎగ‌బ‌డుతుంటారు. ఈ రంగు ఎంత ఇష్టం అయిన‌ప్ప‌టికీ శుభ‌కార్యాల‌కు మాత్రం వేసుకోకూడ‌దు అంటుంటారు. మీరు మీ అమ్మ‌ల‌తో క‌లిసి షాపింగ్‌కి వెళ్లిన‌ప్పుడు కూడా గ‌మ‌నించే ఉంటారు క‌దా.. న‌లుపు రంగు దుస్తులు ముట్టుకుంటే చాలు వ‌ద్దు వ‌ద్దు అని తిట్టేస్తుంటారు. అస‌లు శుభ‌కార్యాల‌కు న‌లుపు ఎందుకు వేసుకోకూడ‌దో తెలుసుకుందాం.

న‌లుపు రంగు శ‌ని దేవునికి (Lord Shani) సంబంధించిన‌ది. అందుకే ఆ రంగుని ధ‌రిస్తే ఏలినాటి శ‌ని దాప‌రిస్తుంద‌ని న‌మ్ముతుంటారు. అయితే శ‌ని దేవుని అనుగ్రహం ఏ రాశి వారిపై అయితే ఎక్కువ‌గా ఉంటుందో వారు నిర్మొహ‌మాటంగా న‌లుపు రంగువి ఏవైనా ధ‌రించ‌వ‌చ్చు. అయితే న‌లుపు రంగుని ఎక్కువ‌గా రాజ‌కీయ నాయ‌కులు ధ‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌తారు. ఎక్కువ‌గా వారు న‌ల్ల బెల్ట్ ధ‌రిస్తుంటారు. ఎందుకంటే శ‌ని దేవుని కృప రాజ‌కీయ వృత్తిలో ఉన్నావారికి ఎక్కువ‌గా ఉంటుంది. శ‌ని అనుగ్ర‌హం బాగా ఉంటే నలుపు ధ‌రించ‌వ‌చ్చ‌ని జ్యోతిష్య నిపుణులు కూడా స‌ల‌హాలు ఇస్తుంటారు. ఇలాంటివారికి నీలం కానీ ఇత‌ర జాతిర‌త్నాలు కానీ ధ‌రించ‌మ‌ని చెప్ప‌రు. న‌ల్ల బెల్ట్ కానీ న‌ల్ల స్ట్రాప్ ఉన్న వాచీ కానీ పెట్టుకోమ‌ని చెప్తుంటారు.

న‌లుపు ఎందుకు వ‌ద్ద‌ని అంటుంటారంటే తెలుపు, న‌లుపు అనే రంగులు ఎవ‌రైనా చ‌నిపోతే వారికి సంతాపం తెలిపేందుకు వేసుకుంటూ ఉంటారు. అందుకే శుభ‌కార్యాలు, పండుగ‌ల స‌మ‌యంలో ఈ రంగుల దుస్తులు వేసుకోవ‌ద్దు అని పెద్ద‌లు చెప్తుంటారు. అయితే చాలా మంది ఎడ‌మ కాలికి న‌ల్ల దారం క‌ట్టుకోవ‌డం మీరు గ‌మ‌నించే ఉంటారు. ఈ దారం న‌లుపు రంగులోనే ఉండి తీరాలి. అప్పుడే దిష్టి, న‌ర దిష్టి త‌గ‌ల‌కుండా ఉంటుంది. అందుకే పిల్ల‌ల‌కి కూడా పాదాల‌పై కాటుక పెడుతుంటారు.

ఏ రోజుల్లో న‌లుపు ధ‌రించకూడ‌దు?

సోమ‌వారం, మంగ‌ళ‌వారం, శ‌నివారాల్లో న‌లుపు ధ‌రించ‌కూడ‌దు. సోమ‌వారం శివుడికి (Shiva) సంబంధించిన రోజు. సోమ‌వారం నాడు న‌లుపు వేసుకుంటే నెగిటివిటీకి ఎక్కువగా ఆక‌ర్షితుల‌వుతారు. మంగ‌ళ‌వారాలు ఆంజ‌నేయ స్వామికి (Hanuman) సంబంధించిన దినాలు. కుజుడికి వ్య‌తిరేకి కాబ‌ట్టి న‌లుపు అస్స‌లు వేసుకోకూడ‌దు. శ‌నివారం కూడా ఆంజనేయ స్వామికి ప్ర‌తీక కాబ‌ట్టి ఆ రోజు కూడా అస్స‌లు ధ‌రించ‌కూడ‌దు. ఆంజ‌నేయ స్వామి న‌లుపు రంగుకి దూరంగా ఉంటారు. అలాంటిది న‌లుపు దుస్తులు వేసుకుని ఆయ‌న్ను పూజించినా కూడా ఫ‌లితం ఉండ‌దు.

పెళ్లి త‌ర్వాత కూడా కొత్త దంప‌తులు న‌లుపు రంగు దుస్తుల‌ను ధ‌రించ‌కూడ‌దు అని చెప్తుంటారు. కొంత‌కాలం పాటు కాస్త న‌లుపున్న దుస్తుల‌ను కూడా ధ‌రించ‌కూడ‌దు. వారే కాదు.. కొత్త‌గా శుభ‌కార్యం జ‌రిగిన ఇంట్లోని ఎవ్వ‌రూ కూడా న‌లుపు అస్స‌లు ధ‌రించరు. మ‌రి అయ్య‌ప్ప భ‌క్తుల మాల‌లు న‌లుపులో ఉంటాయి క‌దా అని అనుకుంటున్నారా? శ‌బ‌రిమ‌లై ధ‌ర్మ శాస్త్రం భక్తుల‌ను శ‌ని దేవుని నుంచి కాపాడుతుంద‌ట‌. మ‌రో కార‌ణం ఏంటంటే.. ఇత‌ర రంగులు మ‌న దృష్టికి ఆక‌ర్షిస్తాయేమో కానీ న‌లుపు రంగు వేసుకుంటే ఏకాగ్ర‌త‌తో ఉంటార‌ట‌.