Belly Fat: సింపుల్ మార్పులు.. వేలాడే పొట్ట మాయం

simple changes in lifestyle helps you lose Belly Fat

Belly Fat:  వేలాడే పొట్ట‌..ఆడ‌వారికి మ‌గ‌వారికి అన్న తేడా లేకుండా అంద‌రినీ హింసిస్తున్న అంశం ఇదే. వ్యాయామాలు చేస్తున్నామండీ అయినా త‌గ్గ‌ట్లేదు అని కొంద‌రు.. తిండి మానేసామండీ అని మ‌రికొంద‌రు బాధ‌ప‌డుతుంటారు. నిజానికి తిండి మానేస్తేనో వ్యాయామం చేస్తేనో త‌గ్గేది కాదు ఈ మొండి బెల్లీ ఫ్యాట్. ఎలా తింటున్నాం.. ఎలా వ్యాయామం చేస్తున్నాం అనేది చూసుకోవ‌డం ఎంతో కీల‌కం.

మీరు ప‌నిగ‌ట్టుకుని తిండి మానేయాల్సిన అవ‌స‌రం లేదు. తిండి మానేస్తే బ‌రువు తగ్గుతారు పొట్ట త‌గ్గుతుంది అనుకోవ‌డం మానేయండి ముందు. ఒక‌వేళ తగ్గినా అది అనారోగ్యానికి దారి తీస్తుంది. ఆరోగ్య‌క‌రంగానే ఈ బెల్లీ ఫ్యాట్‌ను త‌గ్గించుకోవ‌డానికి ప్ర‌య‌త్నించాలి. ఒక‌వేళ మీకు ఆక‌లేస్తే తినండి. కానీ త‌క్కువ కేలొరీలు ఉన్న ఆహారాలు తిన‌డానికి ప్ర‌య‌త్నించండి. మీరు నోరు క‌ట్టేసుకోవాల్సింది జంక్ ఫుడ్స్, అధిక కేలొరీలు ఉన్న ఆహారాల ప‌ట్ల అన్న ఒక్క విష‌యాన్ని గుర్తుంచుకోండి.

మీరు ఏం తిన్నా అందులో పీచు ప‌దార్థం ఉండేలా చూసుకోండి. పీచు ప‌దార్థం వ‌ల్ల మ‌ల‌బ‌ద్ధ‌కం ద‌రిచేర‌దు. భోజ‌నం నిదానంగా హాయిగా జీర్ణం అయిపోయి మ‌ల‌విస‌ర్జ‌న సులువుగా అయ్యేలా చేస్తుంది. మీకు ఉద‌యాన్నే ఫ్రీ మోష‌న్ అవుతోందంటే.. మీ అంత అదృష్ట‌వంతులు మ‌రొక‌రు ఉండ‌రు.

కొన్నిసార్లు తియ్య‌గా చ‌ల్ల‌గా ఏద‌న్నా తాగాల‌నిపిస్తుంటుంది. అలాంట‌ప్పుడు చ‌క్క‌గా తేనె లేదా బెల్లం క‌లుపుకుని నిమ్మ‌ర‌సం తాగేందుకు ప్ర‌య‌త్నించండి. అది లేక‌పోతే కాస్త బెల్లం ప‌టిక‌ను నోట్లో వేసుకోండి. అంతేకానీ కూల్‌డ్రింక్స్, షుగ‌రీ డ్రింక్స్ జోలికి అస్స‌లు వెళ్ల‌ద్దు. పైగా వాటిలో నుంచి చ‌చ్చిన ఎలుక‌లు, బ‌ల్లులు, బొద్దింక‌లు వ‌స్తున్నాయ‌ట‌. జాగ్ర‌త్త‌! మీకు మ‌ద్యం అల‌వాటు ఉంటే లిమిట్‌లో తీసుకోండి. ఎక్కువ‌గా తాగితే ప్రాణాల‌కు హానిక‌రం అని గుర్తుంచుకోండి.

రోజు మొత్తంలో మీరు తినేవాటిలో కూర‌గాయ‌లు, పండ్లు ఎక్కువ‌గా ఉండేలా చూసుకోండి. ఇంకా ప్రొటీన్ కూడా ఎంతో అవ‌స‌రం. గుడ్లు, ప‌న్నీర్‌, చికెన్ వంటివి తీసుకుంటే కండ‌రాలు బిల్డ్ అవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. ప్రొటీన్ తీసుకోకుండా ఎంత వ‌ర్క‌వుట్స్ వ్యాయామాలు చేసినా వేస్ట్. ఎక్కువ కేలొరీలు క‌రిగించాలంటే బెస్ట్ వ్యాయామం కార్డియో. ఇంట్లో ట్రెడ్ మిల్ ఉంటే చ‌క్క‌గా దానిపై మీ శ‌రీరం స‌హ‌క‌రించేలా ర‌న్నింగ్ లేదా జాగింగ్ చేసుకోవ‌చ్చు. ఆ వెసులుబాటు లేక‌పోతే నేల‌పై చెప్పులు లేకుండా తిరిగితే మ‌రీ మంచిది. నేల శుభ్రంగా ఉండేలా ముళ్లు వంటివి లేకుండా చూసుకోండి.