Health: 5 భారతదేశపు సూపర్ ఫుడ్స్..!
Health: సూపర్ ఫుడ్ అంటే ఏంటి? సూపర్ ఫుడ్ అంటే అన్ని రకాల శరీర తత్వాలకు సూట్ అయ్యి బోలెడు పోషకాలు అందించినప్పుడు దానిని సూపర్ ఫుడ్ అంటారు. మన భారతదేశంలో ఇలాంటి ఐదు సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఈ సూపర్ ఫుడ్స్‌ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు సాఫ్ట్ మెరిసే చర్మం, ఆరోగ్యకరమైన జుట్టు, ఇమ్యూనిటీని నేచురల్‌గా మెరుగుపరుస్తాయి. ఈ ఫుడ్స్ ఎప్పుడు ఎందుకు ఎలా తినాలి అనేది కూడా తెలుసుకుందాం. భారతదేశపు మార్కెట్‌లోకి ఏదో ఒక సూపర్ ఫుడ్ వస్తూనే ఉంటుంది. మన భారతదేశ చరిత్రలో వాడుకలో ఉన్న సూపర్ ఫుడ్స్ ఏంటి?
అరటి
అన్ని రకాల పండ్లు ఆరోగ్యానికి మంచివే. కానీ సూపర్ ఫుడ్‌గా అరటి పండు గురించి చెప్పాలి. మార్కెట్‌లో ఏ సమయంలోనైనా కొనగలిగే రేట్లకే దొరుకుతాయి. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మన సంప్రదాయంలో కూడా విశిష్టమైన పాత్ర కలిగింది. మన బాడీని మెంటల్‌గా ఫిజికల్‌గా రీచార్జ్ చేసే సుగుణాలు అరటిలో ఉన్నాయి. అరటి పండు తింటే బరువు పెరుగుతామా? లేదు. ఎందుకంటే ఇందులో కొవ్వు శాతం తక్కువ. ఇందులోని ప్లాంట్ స్టెరాల్ అనే కాంపౌండ్ ఉండటం వల్ల త్వరగా కొవ్వును కరిగిస్తుంది కూడా.
ఆయుర్వేదం ప్రకారం అరటి పండును బరువు పెరిగేందుకు, బరువు తగ్గేందుకు వాడుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌కి అరగంట ముందు ఖాళీ కడుపుతో అరటి తింటే కచ్చితంగా బరువు తగ్గుతారు. రోజులో మిగిలిన సమయంలో కానీ ఎప్పుడైనా సరే అరటిపండును తింటే ఆరోగ్యకరంగా బరువు పెరుగుతారు. అరటి తొక్కలో అరటిపండు కంటే పదిశాతం ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఆ తొక్కలపై స్పూన్‌తో బాగా గీకి తినండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కొబ్బరికాయ
కొబ్బరి కాయలో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అందుకే దీనిని శ్రీ ఫలం అని పిలుస్తారు. శుభకార్యం సమయంలో కొబ్బరి కాయలను కొట్టడం వల్ల శుభం జరగడం వల్లే కాక మెదడుకి శక్తిని ఇస్తుందట. గుండెకు ఈ కొబ్బరి కాయ ఎంతో మంచిది. తల్లి పాలల్లో ఉండే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కొబ్బరి కాయల్లో కూడా ఉంటాయి. కోలా, స్పోర్ట్స్ డ్రింక్‌ని మించిన మంచి ఎనర్జీ కావాలంటే కొబ్బరి నీళ్లు బెస్ట్. హ్యాంగోవర్ వల్ల కలిగే తలనొప్పి పోవాలంటే కూడా ఇదే బెస్ట్. లేత కొబ్బరి కడుపుకి చాలా మంచిది. ఇక కొబ్బరి నూనె గుండె పనితీరుకి ఎంతో మంచిది. (Health)
ఉసిరి
ఉసిరిని మనం రాతి ఉసిరి అని కూడా అంటాం. కొన్ని వేల సంవత్సరాలుగా మన భారత్‌తో పాటు ఇతర దేశాలలోనూ దీనిని ఉపయోగిస్తున్నారు. దీనిని సంస్కృతంలో ఆమల్ అంటారు. అంటే అమ్మ, ఆయా అని అర్థం. ఉసిరి కాయల సీజన్ కాకపోయినా ఏదో ఒక రూపంలో లభిస్తూనే ఉంటుంది. ఉసిరి కాయను ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇమ్యూనిటీ బూస్టర్‌గా చెప్పచ్చు. మంచి ఇమ్యూనిటీ లేకపోతే ఎలాంటి ఫిట్‌నెస్ గోల్స్‌ని పొందలేం. ఉసిరిలో ఉండే అధిక విటమిన్ సి కంటి సమస్యలను దూరం చేయగల శక్తితో పాటు సంతాన సాఫల్యతను మెరుగుపరుస్తుంది. ఉడకబెట్టిన ఉసిరి రోజూ తింటే ఎంతో మంచిది. తాజాగా తీసిన ఉసిరి రసాన్ని జుట్టుకు పట్టిస్తే తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది.
బాదం
బాదం ఏమాత్రం సందేహం లేకుండా ఒక సూపర్ ఫుడ్. బాదం అంటే మన చిన్న దేశీ బాదం గురించి ఇక్కడ చెప్పుకుంటున్నాం. మన బాదంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. పొడుగ్గా ఉంటే బాదం మన భారతదేశానికి కావు. నేచురల్‌గానే బాదంలో విటమిన్ ఈ అధికంగా ఉంటుంది. అందుకే కాస్మెటిక్ సంస్థల్లో బాగా ఉపయోగిస్తారు. బాదం నుంచి పూర్తి లాభాలను పొందాలంటే రోజుకు ఐదు బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసుకుని తింటే ఎంతో ఆరోగ్యం. రాత్రి చెంచా బాదం నూనెను పాలల్లో మిక్స్ చేసుకుని తాగండి. జీర్ణ సమస్యలు పోతాయి.
నెయ్యి
ఇది భారతదేశపు నెంబర్ వన్ సూపర్ ఫుడ్. పెరుగుతో తయారు చేస్తేనే అది స్వచ్ఛమైన నెయ్యి అవుతుంది. శరీరాన్ని లోపలి నుంచి బయటి నుంచి మెరుగుపరుస్తుంది. కానీ నెయ్యి తింటే కొవ్వు పెరుగుతుందని భయపడుతుంటారు. ఇది విదేశీ మార్కెటర్స్ చేసే తప్పుడు ప్రచారం. ఇతర నూనెలను అధిక మంటపై కాచితే అవి విషతుల్యం అవుతాయి. కానీ ఎంత వేడి చేసినా ఏమీ కాకుండా ఉండేదే నెయ్యి. అందుకే వంటల్లో దీనిని ఎక్కువగా వాడుతుంటారు. కూరల్లో నెయ్యి వేసుకుని తింటే ఆ కూర నుంచి పూర్తి పోషకాలు అందుతాయి.