Relationship: ఎక్స్‌తో మళ్లీ ప్రేమ.. సాధ్యమేనా?
Relationship: ఎక్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా అది నెగిటివ్ అంశంపైనే ఉంటుంది. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లలో ఎక్స్ గురించి టాక్సిక్ అంశాలను మాత్రమే చూపిస్తున్నారు. ఒకప్పుడు ఒకరంటే ఒకరు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించుకుని కొన్ని కారణాల వల్ల విడిపోయినవారు కోకొల్లలు. వారిలో కొందరు గొడవలై విడిపోయి ఉంటే.. మరికొందరు ఇతరులతో పెళ్లి ఫిక్స్ అవ్వడం వల్లనో.. లేక తమ పార్ట్నర్ను మోసం చేయడం వల్లనో విడిపోతుంటారు. గొడవలై మనస్పర్ధలు వచ్చి విడిపోయి ఉంటే మాత్రం మళ్లీ కలుసుకునే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
మళ్లీ ప్రేమ చిగురించాలంటే ఏం చేయాలి?
*ముందు అసలు గొడవ ఎందుకు వచ్చిందో సరిగ్గా ఆలోచించండి. తప్పు మీ పార్ట్‌నర్‌దే అని మీకు అనిపించినా.. మీకు వారంటే ఇష్టముంటే.. అలాగే వారికీ మీపై ప్రేమ ఇంకా అలాగే ఉంటే జస్ట్ ఒక సారీ ఒక హగ్‌తో అన్నీ మర్చిపోయి మళ్లీ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టండి.
*మనస్పర్ధల వల్ల విడిపోయి ఉంటే అసలు జరిగిన విషయం ఏంటో సవివరంగా చెప్పండి. ఏదీ దాచద్దు. జరిగిన విషయాన్ని చెప్పి సారీ అడిగితే సరిపోతుంది. లేదు మీ పార్ట్నర్కి ఇంకా కోపం ఉంటే కోపం తగ్గాకే మాట్లాడుకుందాం అని చెప్పండి. అంతేకానీ నీకే అంత కోపం ఉంటే నాకెంత ఉండాలి అంటూ మళ్లీ గొడవ పెద్దది చేసుకోకూడదు.
*ఒకవేళ మీరు మీ పార్ట్నర్ని మోసం చేసి.. మీ తప్పు తెలుసుకుని వారి వద్దకు వెళ్లాలనుకుంటే మీ తప్పును వారి ముందు ఒప్పుకుని క్షమించమని అడగండి. గుర్తుపెట్టుకోండి. వారు క్షమించారు అంటే దాని అర్థం మోసం చేసినా ఇంకా ప్రేమిస్తున్నారని. ఒకసారి క్షమించారు కదా అని చేసిన తప్పు మళ్లీ చేస్తే ఇక మిమ్మల్ని దేవుడు కూడా క్షమించలేడు.
*ఇద్దరికీ ఇష్టం ఉండి.. ఇద్దరూ ఒకరినొకరు క్షమించేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలనుకుంటే ఇద్దరికీ నచ్చిన ప్రదేశానికి వెళ్లి రండి. లేదా మీ పార్ట్నర్కు నచ్చిన పని చేయడం.. లేదా వారికి నచ్చిన వస్తువులను కానుకలుగా తెచ్చి ఇవ్వడం కూడా ఒక్కటిచేసే మార్గాలే..!