EXCLUSIVE: కిడ్నీలు పాడైతే నీళ్లు తాగ‌కూడ‌దా?

EXCLUSIVE: నీళ్లు స‌రిగ్గా తాగ‌క‌పోతే కిడ్నీలు (kidneys) పోతాయి అంటుంటారు. మ‌రి కిడ్నీలు పాడైన‌వారు నీళ్లు తాగ‌చ్చా? తాగితే ఏమ‌వుతుంది? తాగ‌క‌పోతే ఏమ‌వుతుంది? వంటి అంశాల‌పై క్లారిటీ ఇచ్చారు ప్ర‌ముఖ ఆహార నిపుణులు వీర‌మాచినేని రామ‌కృష్ణ‌. అస‌లు ఈ అంశంపై ఆయ‌న ఏం చెప్తారో తెలుసుకుందాం.

కిడ్నీలు పాడైన‌వారికి వైద్యులు చాలా అంటే చాలా త‌క్కువ మొత్తంలో నీళ్లు తాగాల‌ని చెప్తుంటార‌ని.. ఇలా చేస్తే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని వీర‌మాచినేని అంటున్నారు. నీళ్లు లేక‌పోతే మ‌నిషి బ‌త‌క‌లేడ‌ని.. కిడ్నీల‌పై లోడ్ ప‌డ‌కుండా ఉండేందుకు వైద్యులు ఇలాంటివి సూచిస్తుంటార‌ని తెలిపారు.

మ‌రి ఏం చేయాలి?

ఒక మ‌నిషి ఎన్ని లీట‌ర్ల నీళ్లు తాగాలి అనేది అత‌ని వ‌య‌సు, వెయిట్‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఇవ‌న్నీ నోట్ చేసుకుని ఎంత వ‌ర‌కు నీరు కావాలో ముందు తెలుసుకోవాలి. ఆ త‌ర్వాత ఆ మ‌నిషి రోజంతా ఎన్ని గంట‌లు మెలుకువ‌గా ఉంటున్నాడు అనేది ప‌రిశీలించాలి. ఉదాహ‌ర‌ణ‌కు ఓ మ‌నిషి రోజుకు 3 లీట‌ర్ల నీళ్లు తాగాల్సి వ‌స్తే.. ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా ప్ర‌తి గంట‌కు 100 మిల్లీలీట‌ర్ల చొప్పున నీళ్లు తీసుకోవాలి. అంటే 30 సార్లు 100 మిల్లీలీట‌ర్ల చొప్పున నీళ్లు తాగాల్సి ఉంటుంది.

ఇది సాధార‌ణ మ‌నిషి కోసం. మ‌రి కిడ్నీ వ్యాధితో బాధ‌ప‌డుతున్నవారు ఏం చేయాలి. ఈ 30 సార్లు 100 మిల్లీలీట‌ర్ల నీటిని 15 గంట‌ల్లో ఎంత గ్యాప్‌తో తీసుకోవాలో వైద్యుల‌ను అడిగి తెలుసుకోవాలి. అంద‌రికీ 3 లీట‌ర్లు అవ‌సరం ప‌డుతుంద‌ని లేదు. మ‌నిషి ఆరోగ్యాన్ని బ‌ట్టి నెఫ్రాల‌జిస్ట్‌లు క్లియ‌ర్‌గా ఎంత శాతం నీరు తీసుకోవాలో క్లియ‌ర్‌గా చెప్తారు. ఒక‌వేళ అర్థంకాక‌పోతే మ‌ళ్లీ మ‌ళ్లీ అడిగి తెలుసుకోవాలే కానీ చూసుకుందాంలే అన్న‌ట్లుగా వ‌దిలేయ‌కూడ‌దు. ముఖ్యంగా నీళ్ల విష‌యంలో కిడ్నీ పేషెంట్లు చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాలి అని వీర‌మాచినేని సూచించారు.