Cancer: బేకింగ్ సోడాతో క్యాన్స‌ర్ త‌గ్గుతుందా?

Cancer: క్యాన్స‌ర్ అనే ప‌దం వింటేనే మ‌నిషి సగం చచ్చిపోతాడు. అస‌లు ఒక మ‌నిషికి క్యాన్స‌ర్ వ‌చ్చింది అని తెలుసుకోవ‌డానికే వైద్యులు రెండు మూడు సార్లు నిర్ధారించుకుంటారు. అంత‌టి పెద్ద జ‌బ్బు ఇంట్లో సులువుగా దొరికే బేకింగ్ సోడాతో (baking soda) త‌గ్గుతుందా? అస‌లు ఈ ప్ర‌చారం వెనుక నిజం ఎంతుందో వివ‌రించారు ప్ర‌ముఖ వైద్య నిపుణులు వీర‌మాచినేని రామ‌కృష్ణ‌. ఆయ‌న దీని గురించి ఏమ‌ని చెప్తున్నారో తెలుసుకుందాం.

ఇలాంటివన్నీ వాట్సాప్‌ల‌లో త‌న‌కు కూడా ఫార్వ‌డ్ మెసేజ్‌ల్లా వ‌చ్చాయ‌ని మండిప‌డ్డారు వీర‌మాచినేని. ఎవ‌రో తిక్క వెద‌వలు వాట్సాప్‌ల‌లో ఫార్వ‌డ్ చేయండి అని చెప్పి ఇలాంటి చెత్త ప‌నులు చేస్తుంటార‌ని.. దీని వ‌ల్ల చాలా మ‌టుకు క్యాన్స‌ర్ పేషెంట్లు తెలీక బేకింగ్ సోడా వాడి ప్రాణాల మీద‌కు తెచ్చుకునే ప్ర‌మాదం కూడా ఉంద‌ని అన్నారు. ఇలాంటివారిపై తాను యాక్ష‌న్ తీసుకోవాల‌ని అనుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. ఆరోగ్యానికి సంబంధించి ఇలాంటి మెసేజ్‌లు వ‌స్తే వెంట‌నే వారి నెంబ‌ర్‌ను రిపోర్ట్ కొట్ట‌డం వంటివి చేయాల‌ని కోరారు.

బేకింగ్ సోడాతో క్యాన్స‌ర్ న‌యం అవుతుంది అనేది పెద్ద పొర‌పాట‌ని.. కిచెన్‌లో దొరికే ప‌దార్థంతో క్యాన్స‌ర్ త‌గ్గిపోతే ఈరోజు ఎంద‌రో క్యాన్స‌ర్ పేషెంట్లు బతికి బ‌య‌ట‌ప‌డేవారు క‌దా అని ఆయ‌న అంటున్నారు. చ‌దువుకున్న‌వారు కూడా ఇలాంటివి న‌మ్మితే ఇక దేశం ఎటు పోతుందో అని భ‌యంవేస్తోంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.