Cervical Cancer: నిర్మలా సీతారామ‌న్ బ‌డ్జెట్‌లో చెప్పిన ఈ వ్యాధేంటి? ఎవ‌రికి ముప్పు?

cervical cancer: కేంద్ర‌మంత్రి నిర్మలా సీతారామ‌న్ (nirmala sitharaman) ఈరోజు మ‌ధ్యంత‌ర బ‌డ్జెట్ (budget 2024) ప్ర‌వేశ‌పెట్టేట‌ప్పుడు ఈ స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ గురించి ప్ర‌స్తావించారు.

స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ అంటే ఏంటి?

స‌ర్వైక‌ల్ అంటే గ‌ర్భాశ‌యం అని. గ‌ర్భాశ‌యంలో ఏర్ప‌డే క్యాన్స‌ర్‌నే స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ అని అంటారు. ఇది లైంగికంగా సంక్ర‌మించే వ్యాధి. కొన్ని రకాల HPV ఇన్ఫెక్షన్లు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి దారి తీస్తాయి. గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా HPV-16, 18 వల్ల వస్తుంది. HPV అంటే హ్యూమన్ పాపిల్లోమా వైర‌స్. భారతదేశ వ్యాప్తంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ మొదటి స్థానంలో ఉండగా గ‌ర్భాశ‌య‌ క్యాన్సర్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా మహిళలకు వచ్చే క్యాన్సర్లలో గర్భాశ‌య‌ క్యాన్సర్‌ది నాలుగో స్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్యాన్సర్ కేసుల్లో ఐదువంతుల కేసులు భారతదేశంలోనే ఉన్నాయి.

ఎందుకు ఈ వ్యాధి వ‌స్తుంది?

చిన్న వయసులోనే లైంగిక క‌ల‌యిక‌లు జ‌ర‌గ‌డం… ర‌క్ష‌ణ లేకుండా సెక్స్‌లో పాల్గొన‌డం… ఫ‌లితంగా చిన్న వయసులో గర్భం దాల్చడంజననేంద్రియాలు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, పోషకాహార లోపం వంటివి కార‌ణంగా చెప్ప‌చ్చు.

ల‌క్ష‌ణాలు

గ‌ర్భాశ‌య క్యాన్స‌ర్ వ‌చ్చిన‌ప్పుడు కొన్ని ర‌కాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. వాటిని చూసి చూడ‌న‌ట్లు వ‌దిలేయ‌కూడ‌దు. వైట్ డిశ్చార్జ్, అధిక రక్త స్రావం, సమయానికి ముందుగానే పీరియడ్స్ రావడం, నడుం నొప్పి, కిడ్నీల వైఫల్యం వంటివి ల‌క్ష‌ణాలుగా క‌నిపిస్తాయి.

ఎలా ఈ వ్యాధి నుంచి ర‌క్షించుకోగ‌లం?

మంచి ఆహారం, నిద్ర‌, వ్యాయామంతో పాటు రెగ్యుల‌ర్ స్క్రీనింగ్స్ త‌ప్ప‌నిస‌రి. దీనితో పాటు స‌ర్వైక‌ల్ క్యాన్స‌ర్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉంది. ఈ వ్యాక్సిన్‌ను మూడు ద‌ఫాలుగా వేస్తారు. ఈ వ్యాక్సిన్ ఖ‌రీదు రూ.12 వేల వ‌ర‌కు ఉంటుంది.

నిర్మ‌ల‌మ్మ ఏం చెప్పారు?

దేశంలో 9 నుంచి 14 ఏళ్ల వయసున్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సీన్ వేయడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్ర‌క‌టించారు.