స్కాం అని తెలీక ప్రియుడిని కడతేర్చి..
Viral News: స్కాం అని తెలీక ఓ అమ్మాయి ప్రేమించినవాడిని చంపేసింది. ఈ ఘటన అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రంలో చోటుచేసుకుంది. మ్యాటర్ ఏంటంటే.. రైలీ అనే వ్యక్తికి మూడు నెలల క్రితం ఓ మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో త్వరలో మీ ఖాతాలోకి 32 మిలియన్ డాలర్లు రాబోతున్నాయి అని రాసుంది. దాంతో రైలీ ప్రియురాలు ఇనా ఓ ప్లాన్ వేసింది. రైలీని చంపేస్తే ఆ డబ్బంతా తనే అనుభవించొచ్చు అనుకుంది. మరో వారం రోజుల్లో డబ్బులు వస్తాయనగా.. ప్లాన్ ప్రకారం ఇనా రైలీ తాగే టీలో ఎథిలీన్ గ్లైకాల్ కలిపింది. అది తాగిన రైలీ కొన్ని నిమిషాల్లోనే చనిపోయాడు.
ఆ తర్వాత ఎవ్వరికీ అనుమానం రాకుండా రైలీ వడదెబ్బతో చనిపోయాడని నమ్మించేందుకు ప్రయత్నించింది. కానీ రైలీ కుటుంబీకులు అతనికి పోస్ట్మార్టం చేయించగా.. విషం వల్ల చనిపోయాడని తేలింది. దాంతో ఇనాపై పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు ఇనాను అదుపులోకి తీసుకుని విచారించగా.. 32 మిలియన్ డాలర్లు రావాల్సి ఉందని దాని కోసమే ఇదంతా చేసానని ఒప్పుకుంది. ఈ 32 మిలియన్ డాలర్ల గురించి పోలీసులు విచారించగా.. అది సైబర్ నేరగాళ్ల పని అని తేలింది. దాంతో ఇనా మోసపోయి ప్రియుడ్ని చంపుకున్నానంటూ విలపించింది. కోర్టులో నేరం రుజువు కావడంతో 23 ఏళ్లు కారాగార శిక్ష విధించింది. అంతేకాదు.. ఇనా చేత 4000 డాలర్ల పరిహారం కూడా ఇప్పించింది.