Roads on Moon: చంద్రుడిపై రోడ్లు రాబోతున్నాయ్..!
ఇప్పటికే చంద్రుడిపైకి రోవర్‌లను పంపించేసాం. ఇక కొన్నేళ్లలోనే భారతీయుడు చంద్రుడిపై కాలు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆశాభావం వ్యక్తం చేసారు. ఇప్పుడు చంద్రుడిపై రోడ్లు (roads on moon) వేసే ప్రక్రియ గురించి ఆలోచిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఆ ఆలోచన యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి (european space agency) వచ్చింది. పేవర్ మిషన్‌లో భాగంగా చంద్రుడిపై రోడ్లు వేసే ప్రక్రియ గురించి రీసెర్చ్ మొదలుపెట్టింది. పవర్‌ఫుల్ లేజర్ ఉపయోగించి చంద్రుడిపై ఉన్న మట్టి భాగాన్ని గ్లాస్‌గా మార్చి రోడ్లు వేయనున్నారట.
చంద్రుడిపై ఉండే మట్టి చాలా బరకగా ఉంటుంది. కాబట్టి దాంతో ప్రయోగాలు చేయాలంటే సాహసంతో కూడిన అంశం. అపోలో మిషన్‌లో భాగంగా వ్యోమగాములు చంద్రుడిపైకి వెళ్లినప్పుడు అక్కడ ఉన్న మట్టి ఎన్నో సమస్యలను కలిగించిందట. వ్యోమగాములు వేసుకున్న దుస్తుల్లోకి కూడా వెళ్లిపోయిందట. వారు దిగిన వ్యోమనౌకకు అంటుకోవడం వల్ల విపరీతంగా వెడెక్కాయట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో చంద్రుడిపై చేపట్టే మిషన్లకు ఈ మట్టి అడ్డంకి కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు తెలిపారు. (roads on moon)
గతంలో సోవియన్ యూనియన్ చంద్రుడిపై ప్రవేశపెట్టిన లూనోకోడ్ 2 రోవర్ చంద్రుడిపై ఉన్న మట్టి వల్ల ఓవర్ హీట్ అయ్యి పేలిపోయింది. ఇప్పుడు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టనున్న పేవర్ మిషన్‌కు జర్మనీ, ఆస్ట్రియాకు చెందిన స్పేస్ యూనివర్సిటీలు సాయం చేయనున్నాయి. చంద్రుడిపై మట్టిని కరిగించేందుకు 12 కిలోవాట్ల కార్బన్ డయాక్సైడ్‌ని ప్రయోగించారట. చంద్రుడిపై దాదాపు 20 సెంటీమీటర్ల మేర లేజర్ బీమ్ ద్వారా త్రికోణం ఆకారంలో రంధ్రాలు నిర్మించి దానిలో ఈ కార్బన్ డయాక్సైడ్ పోస్తారు. ఈ త్రికోణాలు ఒక పజిల్‌గా ఏర్పడి చంద్రుడిపై రోడ్డులా వేసేందుకు ఉపయోగపడతాయి. ఒకవేళ ఇది పగిలిపోయినా మళ్లీ అతుక్కునేలా తయారుచేస్తున్నారు.