కేసు పెట్టడానికి వెళ్తే మహిళ వక్షోజాలపై తన్నిన పోలీసులు
Odisha: ఓ ఆర్మీ అధికారి, అతనికి కాబోయే భార్య పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అర్థరాత్రి ఓ ఆడపిల్లను తీసుకుని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా అక్కడ వారికి జీవితంలో మర్చిపోలేని చేదు అనుభవం ఎదురైంది. ఒడిశాకు చెందిన ఓ ఆర్మీ అధికారి తనకు కాబోయే భార్యతో కలిసి రెస్టారెంట్ నుంచి అర్థరాత్రి 1 గంటకు ఇంటికి వెళ్తుండగా.. కొందరు ఆకతాయిలు వారి కారును వెంబడించి గొడవ చేసారు. దాంతో వారు నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలనుకున్నారు. అప్పుడు స్టేషన్లో ఓ మహిళా కానిస్టేబుల్ ఉండగా ఆమె కేసు లేదు ఏమీ లేదు వెళ్లండి అని దురుసుగా ప్రవర్తించింది. దాంతో ఆ యువతి తానో న్యాయవాదినని తన కేసును ఎందుకు తీసుకోరు అని వాదించింది. దాంతో కానిస్టేబుల్ పై అధికారులకు ఫోన్ చేయగా వారు స్టేషన్‌కు చేరుకున్నారు.
ఆర్మీ అధికారి చేత ఫిర్యాదు రాయిస్తుండగా పోలీసులు ఉన్నట్టుండి ఆ వ్యక్తి చొక్కా పట్టుకుని ప్యాంట్ విప్పి వస్తువులన్నీ లాగేసుకున్నారు. వదలండి అని అడ్డుకోబోయిన ఆ యువతిని ఈడ్చి పడేసారు. చున్నీతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి జైల్లో పెట్టారు. పైగా ఓ పోలీస్ అధికారి ఆమె వక్షోజాలపై పలుమార్లు తన్నాడు. ప్యాంట్ జిప్ తీస్తూ వికృతంగా ప్రవర్తించాడు. వారి తప్పు లేకపోయినా పోలీసులపై చేయిచేసుకుంది అంటూ ఆ యువతిపై కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ కేసును కోర్టును పరిశీలించగా.. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయని.. ఎయిమ్స్‌కు తరలించాల్సి వచ్చిందని యువతి తరఫు న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఆ యువతికి బెయిల్ మంజూరు చేస్తూ ఇలాంటి ఘటనకు పాల్పడిన ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేసారు.