TCS: అమెరిక‌న్ల‌ను తీసేని భార‌తీయుల‌కు ఉద్యోగాలు ఇచ్చిందా? ఏం జ‌రిగింది?

TCS: ప్ర‌ముఖ ఐటీ కంపెనీ టాటా క‌న్‌స‌ల్టెన్సీ కంపెనీపై షాకింగ్ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అమెరికాలో TCS సంస్థ‌లో ప‌నిచేస్తున్న అమెరిక‌న్ల‌ను తొల‌గించేసి వారి ఉద్యోగాల‌ను H1B ఉన్న భార‌తీయుల‌కు ఇచ్చార‌ని అక్క‌డి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ మేర‌కు అమెరికాకు చెందిన ఈక్వ‌ల్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్‌చ్యూనిటీ క‌మిష‌న్ (EEOC)కు 22 ఫిర్యాదులు అందాయి. రెండు నెల‌ల ముందు నోటీసులు కూడా ఇవ్వ‌కుండా వెంట‌నే ఉద్యోగాల్లో నుంచి తీసేసారని వారు ఆవేద‌న వ్యక్తం చేసారు.

ఉద్యోగాలు కోల్పోయిన వారి వ‌య‌సు 40 నుంచి 60 మ‌ధ్య‌లో ఉంటుంది. సాధార‌ణంగా కంపెనీల్లో లేఆఫ్స్ జ‌రుగుతుంటాయి కానీ త‌మ‌ను మాత్రం జాతి, రంగు, దేశాన్ని బ‌ట్టి టీసీఎస్ తొల‌గించేసింద‌ని ఆరోపిస్తున్నారు. ఉద్యోగాల నుంచి తీసేసిన వారి చ‌దువులు కూడా ఉన్న‌త‌మైన‌వి. చాలా మంది ఎంబీఏ చేసిన వారు ఉన్నారు. H-1B ఉన్న భార‌తీయుల‌ను ప్ర‌త్యేకంగా చూసి త‌మ‌ను మాత్రం జాతి, రంగుతో విభేదించార‌ని ఆరోపించారు. దాంతో ఈ అంశం కాస్తా అమెరికాలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై టీసీఎస్ స్పందిస్తూ.. అస‌లు తాము ఇలాంటి ప‌ని ఎప్పుడూ చేయ‌మ‌ని.. టీసీఎస్‌కు కొన్ని విలువ‌లు ఉన్నాయ‌ని వాటిని ఎప్పుడూ దాట‌లేదని వెల్ల‌డించారు. మ‌రి వారు ఎందుకు ఇలాంటి ఆరోప‌ణ‌లు చేస్తున్నారో తెలీడంలేద‌ని అన్నారు.