Underwater Metro: దేశంలోనే తొలి మెట్రో.. కలకత్తాకు ఎలా సాధ్యమైంది..?
Underwater Metro: దేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రోను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. కలకత్తాలో ఈ మెట్రోను నిర్మించారు. ఇలాంటి మెట్రో మన దేశంలో రావడం ఇదే మొదటిసారి. అసలు కలకత్తాకు ఇలాంటి ఒక అండర్‌వాటర్ మెట్రో ఎలా సాధ్యమైందో.. ఈ మెట్రో విశేషాలేంటో తెలుసుకుందాం.
రవాణా విషయానికొస్తే కలకత్తా తన పేరును చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించుకుందనే చెప్పాలి. కలకత్తా నగరానికి తొలి మెట్రో 1988లో వచ్చింది. ఆ తర్వాత మళ్లీ మరో మెట్రో రావడం ఇప్పుడే. అది కూడా అండర్‌వాటర్ మెట్రో. హౌరా మైదాన్ నుంచి ఎస్ప్లనేడ్ అనే ప్రాంతం వరకు దాదాపు 4.8 కిలోమీటర్ల మేర ఈ అండర్‌వాటర్ మెట్రోను నిర్మించారు. శతాబ్దాల నాటి రెండు నగరాలను ఈ మెట్రో కలుపుతుంది. హౌరాలోని 33 మీటర్ల లోతులో దీని మెట్రో స్టేషన్ ఉంది. హూగ్లీ నది లోపలి నుంచి ప్రయాణించే ఈ మెట్రో 520 మీటర్ల దూరాన్ని కేవలం 45 సెకెన్లలో కవర్ చేస్తుంది. దీని వల్ల చాలా మటుకు ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (Underwater Metro)
ఈ అండర్‌వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కోసం పెట్టిన ఖర్చు రూ.10,442 కోట్లు. కలకత్తా మెట్రో రైల్ కార్పొరేషన్ దీనిని నిర్వహించే బాధ్యతలు తీసుకుంది. ఈ అండర్‌వాటర్ దూరం 16.55 కిలోమీటర్లు ఉంది. దీనిలోని 9.3 కిలోమీటర్ల ప్రయాణం ఆల్రెడీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ టన్నెల్‌ను కేవలం 66 రోజుల్లోనే నిర్మించేసారట. హౌరా బ్రిడ్జ్ అలియాస్ రబీంద్ర సేతు లోపలి భాగంలో 350 మీటర్ల లోతులో నిర్మించారు. గంటకు 80 కిలోమీటర్ల స్పీడ్‌తో ఈ మెట్రో వెళ్తుంది. ఈ ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేసినప్పటి నుంచి ఎన్నో సమస్యలు వచ్చాయని చాలా సవాళ్లను ఎదుర్కొని పూర్తి చేసామని అధికారులు తెలిపారు. కానీ టెక్నాలజీ పుణ్యమా అని పూర్తి చేయగలిగామని పేర్కొన్నారు.
దీనికి ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ కూడా ఉంది. ఒకవేళ డేంజర్ సిగ్నల్ పడితే లోకో పైలట్ రైలును ముందుకు పోనివ్వడానికి అవకాశం లేకుండా నిర్మించారు. పరిమిత వేగంలోనే రైలు వెళ్తుంది. అంతకంటే ఎక్కువ స్పీడ్‌తో వెళ్లాలనుకున్నా కూడా సాధ్యం కాదు. స్పీడ్ పెరిగితే ఆటోమేటిక్ బ్రేక్‌లు ఆన్ అవుతాయి. అప్పుడు స్పీడ్ నియంత్రణలోకి వస్తుంది. మానవ తప్పిదంతో జరిగే ప్రమాదాలు జరగకుండా ఈ మెట్రోను నిర్మించారు. ఇక ఈ మెట్రోను నది అడుగు భాగంలోని టన్నెల్స్ మధ్యలో నిర్మించారు. కానీ ఒక్క చుక్క నీరు కూడా టన్నెల్ లోపలికి రాదు. అంత బాగా డిజైన్ చేసి మరీ నిర్మించారు. ఒకవేళ ఏదన్నా ప్రమాదవశాత్తు నీరు లోపలికి వచ్చినా గాస్కెట్స్ తెరుచుకుంటాయి. ఇవి తెరుచుకోవడం ద్వారా ఆటోమేటిక్‌గా ఏ రంధ్రం నుంచైతే నీరు లోపలికి వస్తున్నాయో ఆ రంధ్రాన్ని నియోప్రీన్ అనే టేప్ మూసేస్తుంది.
అయితే మెట్రోలో ప్రయాణిస్తున్నవారికి నీరు కనిపిస్తుంది అనుకుంటే పొరపాటే. ఇదేమీ టూరిస్ట్‌ల కోసం నిర్మించింది కాదు. ప్రయాణికులకు కేవలం టన్నెల్ మాత్రమే కనిపిస్తుంది. నీరు అస్సలు కనిపించదు. అంతెందుకు.. అసలు నదిలో వెళ్తున్నట్లు కూడా అనిపించదు. అయితే మరీ టన్నెల్‌ని చూస్తూ ప్రయాణిస్తే కూడా బోర్ కొడుతుంది. అందుకే 40 ఇల్యుమినేటెడ్ చేపలు కనిపించేలా డిజైన్ చేసారు. అంటే కృత్రిమ చేపలు అటూ ఇటూ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఒకప్పటి స్వాతంత్ర్య సమరయోధుడు కలకత్తా గురించి అప్పట్లో ఒక మాట చెప్పారు. కలకత్తా ఈరోజు ఆలోచిస్తుంది.. భారత్ రేపు ఆలోచిస్తుంది అని. ఆయన అన్ని నూటికి నూరు పాళ్లు నిజం అని రుజువు చేసింది పశ్చిమ బెంగాల్ రాజధాని.