కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేదని దారుణ హత్య
Viral News: కోడి ముందా గుడ్డు ముందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం ఎవ్వరికీ తెలీదు. అదేదో తెలుగు సినిమాలో సునీల్ కోడి ముందు ఉంటుంది కాబట్టి గుడ్డు వెనకి వస్తుంది కాబట్టి కోడి ముందు అని చెప్పాడు. కానీ ఇప్పటికీ ఈ ప్రశ్న ఓ చిక్కుగానే మిగిలిపోయింది. కానీ ఈ చిక్కు ప్రశ్న ఓ యువకుడి ప్రాణాలను తీస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు.
ఇండోనేసియాకు చెందిన ఓ వ్యక్తి కోడి ముందా గుడ్డు ముందా అనే ప్రశ్నకు సమాధానం చెప్పలేదని తన స్నేహితుడిని దారుణంగా చంపేసాడు. డీఆర్ అనే వ్యక్తి తన స్నేహితుడు కాదిర్‌ను తాగుదామని ఇంటికి పిలిచాడు. ఇద్దరూ పీకల దాకా తాగారు. ఆ సమయంలో డీఆర్.. కోడి ముందా గుడ్డు ముందా అని కాదిర్‌ను అడిగాడు. దీనికి కాదిర్ నాకు తెలీదు అని సమాధానం ఇచ్చాడు. దాంతో డీఆర్ అతనితో గొడవేసుకున్నాడు. ఎందుకొచ్చిందిలే అని చెప్పి కాదిర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కానీ డీఆర్‌కి మాత్రం ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వలేదని పీకలదాకా కోపం వచ్చింది.
తన బైక్‌పై కాదిర్‌ను వెంబడించి తన వద్ద ఉన్న చిన్న కత్తితో దారుణంగా పొడిచేసాడు. స్థానికులు డీఆర్‌ను నిర్భందించి కాదిర్‌ను హాస్పిటల్‌కు తరలించగా తీవ్ర రక్తస్రావం కావడంతో అతను చనిపోయాడు. పోలీసులు డీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు.