గుర్తుపట్టలేని విధంగా 100 శవాలు.. దాచడం కుదరదన్న డాక్టర్లు
Odisha: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో (odisha train accident) ఇప్పటివరకు దాదాపు 300 మంది మృత్యువాతపడ్డారు. వారిలో 200 మృతదేహాలను కుటుంబీకులు గుర్తుపట్టి ఎవరి ఇళ్లకు వారు తీసుకెళ్లారు. ఇంకో 100 శవాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దాంతో ఎక్కువ రోజులు శవాలను మార్చరీలో దాచలేమని స్థానిక వైద్యులు తెలిపారు. పోనీ ఎంబామింగ్ ప్రక్రియ ద్వారా శవాలు కుళ్లకుండా చేద్దామా అంటే అది కూడా వీలు పడదని భువనేశ్వర్ ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. ఎంబామింగ్ అన్ని కేసుల్లో వర్కవుట్ కాదని, మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నప్పుడు ఎంబామింగ్ చేసినా ప్రయోజనం ఉండదని తెలిపారు. ఎంబామింగ్ అనేది మనిషి చనిపోయిన 12 గంటల్లో చేస్తేనే ఆ మృతదేహాన్ని ఎన్నాళ్లైనా కుళ్లకుండా ఉంచవచ్చని అన్నారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో కుటుంబాలు కూడా కన్నీరుమున్నీరవుతున్నాయి. దాంతో మృతదేహాలను సామూహికంగా దహనం చేసేయాలా? లేక వారి కుటుంబాలు గుర్తుపట్టేవరకు వేచి చూడాలా అని పోలీసులు ఆలోచిస్తున్నారు.