Sarfaraz Khan కు ర‌వీంద్ర జ‌డేజా క్ష‌మాప‌ణ‌

Sarfaraz Khan: రాజ్‌కోట్‌ టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ జడేజా (Ravindra Jadeja) చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. రవీంద్ర జడేజా సెంచరీ కోసమే.. సెల్ఫిష్‌గా వ్యవహరించిన సర్ఫరాజ్‌ను ఔట్ చేశాడని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వచ్చాయి. ఫ్యాన్స్ దెబ్బకు సోషల్ మీడియాలో జడేజాపై విమర్శలు వచ్చాయి. జడేజా ఉద్దేశపూర్వకంగా సర్ఫరాజ్‌ను ఔట్ చేశాడని నెటిజన్లు విమర్శించారు. దీంతో సెల్ఫిష్ జడేజా అనే పదం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ ఘటనపై తొలి రోజు ఆట అనంతరం జడ్డూ స్పందించాడు.

తన కారణంగా రనౌటైన అరంగ్రేటం ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌కు టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. అలాగే తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టినందుకు సర్ఫరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్‌ అనంతరం జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో క్షమాపణ, అభినందన సందేశాలను కలిపి ఒక పోస్ట్‌ చేశాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌ విషయంలో చాలా బాధగా ఉందన్న రవీంద్ర జడేజా.. తప్పు తనదేనని అంగీకరించాడు. లేని పరుగు కోసం పిలుపునిచ్చానని అన్నాడు. బాగా ఆడావు సర్ఫరాజ్‌ అంటూ జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.

అయితే ఈ పోస్ట్ పై, క్రికెట్‌లో ఇలాంటివన్నీ సహజమేనని సర్ఫరాజ్‌ అన్నాడు. రవీంద్ర జడేజా-తనకు మధ్య ఆ సమయంలో అవగాహన లోపించిందని అన్నాడు. ఎవరో ఒకరు రనౌట్‌ అవుతామని… దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సర్ఫరాజ్‌ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. రవీంద్ర జడేజా తాను బ్యాటింగ్‌ చేసేటప్పుడు మద్దతుగా నిలిచాడని సర్ఫరాజ్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో నిలబడేందుకు కాస్త సమయం తీసుకోవాలని రవీంద్ర జడేజా సూచించాడని ఆ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నించానని వెల్లడించాడు.

క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సర్ఫరాజ్‌ ఖాన్‌ దూకుడుగా బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్‌ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్‌ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్‌ సింగిల్‌ కోసం యత్నించి రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరిగాడు.

భారత- ఎ జట్టు తరపున అవకాశం వచ్చిన ప్రతిసారి సర్ఫరాజ్‌ సత్తాచాటాడు. తాజాగా ఇంగ్లాండ్ లయన్స్ తో జరిగిన తొలి అనధికార టెస్టులో హాఫ్ సెంచరీ సాధించాడు. అంతకుముందు వార్మప్ మ్యాచ్ లో 96 పరుగులు చేశాడు. ఇప్పటివరకూ 45 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 3912 పరుగులు సాధించాడు. అతని సగటు 69.85గా ఉండటం విశేషం. అందులో 14 శతకాలున్నాయి. అతని అత్యధిక స్కోరు 301 నాటౌట్‌. ఈ క్రమంలో గిల్ ను అధిగమించాడు. సచిన్ తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. ప్రతిభపరంగా, నైపుణ్యాల పరంగా, ఆట పరంగా సర్ఫరాజ్‌పై ఎలాంటి సందేహాలు లేవు. కానీ భారత జట్టులో తీవ్రమైన పోటీ కారణంగా ఇన్ని రోజులూ చోటు దక్కలేదు.