Michael Clarke: ముంబై ఇండియ‌న్స్ టీంలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు

Michael Clarke: ముంబై ఇండియ‌న్స్ (Mumbai Indians) టీంలో అంత‌ర్గ‌త క‌ల‌హాలు ఉన్నాయ‌ని షాకింగ్ వ్యాఖ్య‌లు చేసారు మాజీ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ మైకెల్ క్లార్క్.  నిన్న ముంబై ఇండియ‌న్స్‌కి ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్‌కి (Lucknow Super Giants) మ‌ధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్ మ‌రోసారి దారుణంగా ఓడిపోయింది. దీనిపై క్లార్క్ మాట్లాడుతూ.. పిచ్‌పై ఎలా ఉన్నా డ్రెస్సింగ్ రూంలో మాత్రం వేరు వేరు గ్రూప్‌లుగా ఉంటున్నార‌ని.. వారిలో వారికే ఐక‌మత్యం లేద‌ని అన్నారు. టీం అంతా ఒక్క‌టై ఆడితేనే గెలిచే అవ‌కాశాలు ఉన్నాయి కానీ ఎవ‌రో ఒక్క‌రే ఆడుతుంటే టీం గెల‌వ‌డం చాలా క‌ష్టం అని తెలిపారు.

కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌ను ప‌క్క‌న పెట్టి హార్దిక్ పాండ్య‌ను నియ‌మించ‌డంతో టీంలో క‌ల‌హాలు చోటుచేసుకుంటున్నాయ‌ని అన్నారు. ప్లేఆఫ్‌కు క్వాలిఫై అవ్వాలంటే మిగిలున్న మిగ‌తా ఐదు మ్యాచ్‌ల‌లో గెలిచి తీరాల్సిందే అని చెప్పారు. ముంబై ఇండియ‌న్స్ టీంలో రోహిత్ శ‌ర్మ‌, హార్దిక్ పాండ్య‌, సూర్య‌కుమార్ యాద‌వ్, టిమ్ డేవిడ్, జ‌స్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ఆట‌గాళ్లు ఉన్నా కూడా గెల‌వ‌లేక‌పోవ‌డం షాకింగ్ అంశం అని తెలిపారు. రోహిత్ శ‌ర్మ సెంచ‌రీ చేస్తేనో.. బుమ్రా బౌలింగ్ చేస్తేనో టీం గెలిచేస్తుందని.. కానీ టీంలో ఉన్న మిగ‌తా ఆట‌గాళ్లు కూడా క‌లిసిక‌ట్టుగా ఆడితేనే అన్ని మ్యాచ్‌లు గెల‌వ‌గ‌లుతార‌ని స‌ల‌హా ఇచ్చారు.