David Lloyd: T20 మ్యాచ్.. టీమిండియాపై లాయిడ్ షాకింగ్ కామెంట్స్
David Lloyd: త్వరలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో ఎలాగైనా కప్ సాధించి ఆ లోటు తీర్చేందుకు మన కుర్రాళ్లు కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ ఇండియా స్క్వాడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసారు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లలో ఇండియాను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఇండియా ఆటతీరును సులువుగా ముందే పసిగట్టేయొచ్చని తీసిపారేసినట్లు మాట్లాడారు.
టీమిండియా ICC మ్యాచ్‌లలో ఎలాంటి రిస్కీ నిర్ణయాలు తీసుకోదని అందుకే 2013 నుంచి ఒక్క టోర్నమెంట్ కూడా కొట్టలేకపోయిందని వ్యాఖ్యానించారు. నాకౌట్ స్టేజ్ వరకు వచ్చి ట్రోఫీ గెలవకుండానే ఓడిపోతున్నారని వెక్కిరించారు. మరోపక్క ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో సీనియర్ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తామని చెప్పిన సెలెక్టర్లు అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి ప్లేయర్లను ఎంపికచేసారు. వీరికి అవకాశం ఇచ్చేందుకు రింకూ సింగ్ వంటి యువ ఆటగాళ్లను రిజర్వ్ స్థానంలో పెట్టడంపై చర్చ జరుగుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ వంటి అతిపెద్ద లీగ్ క్రికెట్‌ను మేనేజ్ చేయగలిగిన టీమిండియా.. 2007 నుంచి ఒక్క టీ20 వరల్డ్ కప్ గెలవలేకపోయిందనే టాక్ ఉంది. ఆ టాక్‌ను ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌తో ముగింపు పలికి వేలెత్తి చూపించినవారి మూతి పగిలేలా సమాధానం ఇవ్వాలని విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు నిర్ణయించుకున్నారు. అందులోనూ ఇది వారికి చివరి టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ కావడంతో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో ఉన్నారు.