Mumbai Indians: IPLకు ముందు ముంబై ఇండియ‌న్స్‌కు భారీ షాక్‌..!

Mumbai Indians: దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడి ఇటీవలే సర్జరీ చేయించుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) IPL 2024లో కొన్ని మ్యాచులకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ముంబై ఇండియన్స్ జట్టుకు ఎదురుదెబ్బే. గతేడాది అద్భుత బ్యాటింగ్‌తో జట్టులో లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు సూర్య. క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజ‌న్ మార్చి 22 నుంచి 17వ సీజన్ ఆరంభం కానుంది.. ఐపీఎల్ రెండో దశ వరకైనా సూర్యకుమార్ అందుబాటులోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగిలేలా ఉంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా గాయపడ్డ అంతర్జాతీయ టీ20 నెంబర్ వన్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్‌లో తొలి రెండు మ్యాచులకు దూరమయ్యే అవకాశం ఉంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనవరిలో స్పోర్ట్స్ హెర్నియాకు సర్జరీ చేయించుకున్నాడు సూర్య. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో రీహాబ్‌లో ఉన్నాడు. అతడు ఇంకా కోలుకోలేదని తెలుస్తోంది.

గాయపడి ఎన్‌సీఏలో కోలుకుంటున్న ఆటగాళ్లు తిరిగి మైదానంలోకి రావాలంటే ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. సూర్యకుమార్ యాదవ్ ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదు. దీంతో జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. తాజాగా రిషభ్ పంత్, మహమ్మద్ షమీ, ప్రసిద్ధ్ కృష్ణలకు సంబంధించిన ఫిట్‌నెస్‌పై ప్రకటన విడుదల చేసిన బీసీసీఐ.. అందులో సూర్య పేరు ప్రస్తావించలేదు. దీంతో అతడు ఇంకా మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించలేదని తెలుస్తోంది. ఐపీఎల్ ప్రారంభానికి మరో పది రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో అతడు తొలి రెండు మ్యాచులకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. (Mumbai Indians)

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఓ ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడుతూ.. త‌న ఫిట్‌నెస్ పై ఎలాంటి సందేహాలు అక్క‌ర‌లేద‌ని చెప్పాడు. కొన్ని వారాల క్రితం త‌న‌కు హెర్నియా సర్జరీ జరిగిన మాట వాస్తవమేన‌ని, కాలికి ఎలాంటి ఇబ్బంది లేదన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌ని పొందడానికి తీవ్రంగా శ్ర‌మిస్తున్న‌ట్లు తెలియ‌జేశాడు. అతి త్వ‌ర‌లోనే అంద‌రిని మైదానంలో క‌ల‌వ‌నున్న‌ట్లు చెప్పాడు.

ఐదు సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌ జట్టు సూర్యకుమార్ సేవలు కోల్పోవడం పెద్ద దెబ్బే. మిస్టర్ 360గా పేరుపొందిన సూర్యకుమార్ యాదవ్.. మైదానం నలువైపులా షాట్లు ఆడటంలో దిట్ట. ఎలాంటి పరిస్థితుల్లో అయినా విధ్వంసం సృష్టించగలగడం అతడి నైజం. గత సీజన్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 16 మ్యాచుల్లో 181.13 స్ట్రయిక్ రేటుతో 605 ర‌న్స్ స్కోర్ చేశాడు. ముంబై జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో ఈసారి కూడా సూర్య అదే ప్రదర్శన పునరావృతం చేయాలని ఆ జట్టు భావిస్తోంది.

ఇప్పటికే ముంబై జట్టు శిక్షణా శిబిరాన్ని ప్రారంభించింది. ఈ సీజన్‌ కోసం రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించిన ముంబై.. హార్దిక్ పాండ్యాకు ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం జట్టులోని కొందరు ఆటగాళ్లకు నచ్చలేదని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌లో ఆ జట్టు ప్రదర్శన ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

ఐపీఎల్ 2024 సీజన్ మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచుతో షురూ కానుంది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియన్స్.. జ‌ట్టు మార్చి 24న గుజ‌రాత్ టైటాన్స్‌తో, మార్చి 27న స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో ఢీకొట్టనుంది.