Ugadi రోజున ఏ దేవుడిని పూజించాలి
Ugadi: వినాయక చవితి రోజున వినాయకుడిని, శివరాత్రి రోజున శివయ్యను ఆరాధిస్తాం. మరి తెలుగు వారికి నూతన సంవత్సరం అయిన ఉగాది రోజున ఏ దేవుడిని పూజించాలి? ఎవర్ని పూజించాలంటే కాలపురుషుడు. ఎవరీ కాలపురుషుడు అనుకుంటున్నారా? మన సనాతన ధర్మంలో కాలం అంటే దైవస్వరూపం. అందుకే పూజ చేసే సమయంలో కాలమాణేన అనే శ్లోకం జపిస్తాం.
కాలాన్ని ఎందుకు ఆరాధించాలి?
కొన్నిసార్లు కాలం కలిసి రావడం లేదు అని అంటుంటాం. కొన్నిసార్లు బోలెడు పనులు ఉన్నా అన్నీ చకచకా అయిపోతాయి. ఇంకొన్ని సార్లు ఓ రెండు మూడు సులువైన పనులు ఉన్నా కూడా అసలు అవ్వవు. అప్పుడు వేళా విశేషం బాలేదు అనుకుంటాం.
ఇదేంటంటే.. కాల పురుషుడు ఆధీనంలో లేకపోవడం. ఆయన్ను ప్రసన్నం చేసుకోవాలి. కాలం మారే సమయంలో ముఖ్యమైన మలుపులు ఉంటాయి. అప్పుడు కాల పురుషుడిని ఆరాధించాలి. అలాంటి మలుపులే సంవత్సరాది, సంక్రాంతి అంటారు.
ఎలా ఆరాధించాలి?
ఉదయాన్నే నిద్రలేచి స్నానాలు కానిచ్చి.. వినాయకుడిని పూజించండి. ఆ తర్వాత పురుష స్తోత్రం అని ఉంటుంది. అది చదవండి చాలు. పురుష స్తోత్రం చదవడం రాకపోతే విష్ణు సహస్ర నామం చదువుకుంటే ఇంకా మంచిది. ఈ పూజలు అయ్యాకే ఇతరులకు ఉగాది శుభాకాంక్షలు చెప్పాలి.