నేడు క్షీరాబ్ది ద్వాదశి.. ఏ పూజ చేస్తే మంచిది?
Spiritual: నేడు క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజున తులసీ దేవికి పూజ చేస్తే ఎంతో పుణ్యం. అసలు క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి? ఈరోజున తులసీ దేవికి ఎందుకు వివాహం చేస్తారు? వంటి అంశాలను తెలుసుకుందాం.
క్షీరాబ్ది ద్వాదశి అంటే ఏంటి?
ఆషాడ మాసంలోని శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటాడని పురాణాలు చెప్తున్నాయి. శుక్ల ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. అందుకే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున అంటే ఈ క్షీరాబ్ది ద్వాదశిన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేస్తే ఎన్నో జన్మల ఫలితాలు సిద్ధిస్తాయి.
ఏం చేయాలి?
చాలా మంది తులసీ విష్ణుమూర్తి వివాహం కాబట్టి తులసీ దేవిని పెళ్లికూతురులా ముస్తాబు చేసి వివాహ వేడుకను జరిపిస్తారు. ఇంట్లో అలా కుదరకపోతే తులసి కోట చుట్టూ దీపాలు, పూలు పెట్టి అలంకరించి పూజ చేయాలి.
స్నానం చేసి ఇంట్లో గంగా జలం అందుబాటులో ఉంటే మీపై చల్లుకుని ఇంట్లో అన్ని ప్రదేశాల్లో చల్లండి. తులసి కోటను శుభ్రంగా ఉంచుకోవాలి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి కాబట్టి ఈరోజే శుభ్రం చేస్తానంటే కుదరదు. రోజూ తులసి కోట పరిశుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి. చేతులు శుభ్రం చేసుకున్నాకే తులసి దళాలను ముట్టుకోవాలి.
పూజ ప్రారంభించే ముందు తులసి కోట ముందు ముగ్గు వేసి ఆ ముగ్గుపై నెయ్యితో వెలిగించిన దీపం పెట్టండి. పూజ సమయంలో ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను వాడకండి. మీకు ఓపిక ఉంటే ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. ఉండలేని వారు కనీసం మాంసం, ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండండి.