ఆరోగ్యానికే కాదు.. అందానికీ గ్రీన్ టీ!
గ్రీన్ టీ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు. అయితే గ్రీన్ టీ పొడి లోని యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇంఫ్లేమేటరీ, యాంటీబయాటిక్ గుణాలు చర్మం కాంతివంతంగా చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. అంతేకాదు కేశ సంరక్షణలోనూ గ్రీన్ టీ అద్భుత ఫలితాలను ఇస్తుంది. నిగనిగలాడే జుట్టుకీ, కాంతివంతమైన చర్మానికీ గ్రీన్ టీ ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం..
• ఒక స్పూన్ గ్రీన్ టీ పొడిలో గుడ్డులోని పచ్చసొన, అర టీస్పూన్ ఆవపిండి వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించాలి. పావుగంట తర్వాత ఏదైనా షాంపూతో తలస్నానం చెయ్యాలి. ఈ విధంగా వారానికి రెండుసార్లు లేదా మూడుసార్లు చేస్తే వెంట్రుకలు తేమని సంతరించుకుని జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
• రెండు కప్పుల నీటిలో ఒక టీ స్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా మరిగించాలి. తలస్నానం చేశాక ఈ నీటిని కుదుళ్లకు పట్టించి మెళ్లగా మసాజ్ చేసి అరగంట తర్వాత చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా తరచుగా చెయ్యడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ అంది దృఢంగా మారుతాయి.
• అర కప్పు కొబ్బరి నూనెలో ఒక టీస్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంటపాటు ఆరిన తర్వాత షాంపూతో గోరువెచ్చని నీటితో తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా చేస్తే జుట్టు చిట్లడం తగ్గి ఆరోగ్యంగా మారుతుంది.
• చర్మ సౌందర్యానికీ గ్రీన్ టీ చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో అర టీస్పూన్ గ్రీన్ టీ పొడి, ఒక టీస్పూన్ తేనె, నాలుగు చుక్కల నిమ్మరసం వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం నిగారింపుతో మెరుస్తుంది.
• గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్, టానిన్స్ కళ్లకింద ఏర్పడే నల్లని వలయాలను తగ్గించడంలో సహాయపడతాయి. గ్రీన్ టీ లోని విటమిన్ కె రక్తప్రసరణ బాగా జరిగేలా చేసి కళ్లకింది వలయాలను తగ్గిస్తుంది. వాడేసిన గ్రీన్ టీ బ్యాగులను అరగంటపాటు ఫ్రిజ్లో పెట్టి కళ్లపై పది నిమిషాలపాటు ఉంచాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేస్తే చక్కని ఫలితం ఉంటుంది.
• ముఖం పై ముడతలను మాయం చేయడంలోనూ గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. రెండు స్పూన్ల పెరుగు, చిటికెడు పసుపు, అర టీస్పూన్ గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి ముఖానికి రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగెయ్యాలి. ఇలా తరచుగా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. గ్రీన్ టీ లోని యాంటీ ఏజింగ్ గుణాల వల్ల చర్మంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
• ముఖం మీది మొటిమలు, వాటి తాలూక మచ్చలనూ తగ్గించేందుకు గ్రీన్ టీ బాగా పని చేస్తుంది. అర కప్పు గ్రీన్ టీ పొడిలో తగినన్ని నీళ్లు పోసి పేస్టులా చేసుకుని ముఖం, మెడ చుట్టూ ప్యాక్లా వేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై మృతకణాలు తొలిగిపోయి మెటిమలు, మచ్చలు తగ్గి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.