త్రిభుజాలు, చతురస్రాలు.. ఈ నగలే నేటి ఫ్యాషన్!
త్రిభుజాలు, చతురస్రాలు, వృత్తాలు.. వాటి చుట్టుకొలతలు, వ్యాసార్థాలు అంటూ చదువుకుంటారు పిల్లలు. అయితే ఇప్పుడు ఆ ఆకారాలే ఆభరణాలుగా అతివలను ఆకర్షిస్తున్నాయి. ఉంగరాలు, గాజులు, కడియాలు, కంటెలుగా వృత్తాలు ప్రాచీనకాలం నుంచే ఆభరణాల్లో కలిసిపోయాయి. చతురస్రాలు, దీర్ఘవృత్తాలూ ఉంగరాలుగా, రకరకాల నగల్లో పొదిగే రాళ్ల ఆకారంగా కనువిందు చేస్తాయి. అయితే ఇప్పుడు నేరుగా ఆ ఆకారాలతోనే తయారైన నగలు మార్కెట్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇటుకమీద ఇటుక పేర్చినట్టు ఆయా ఆకారాలతో రకరకాల డిజైన్లలో నగలు తయారుచేస్తున్నారు.
చాలా కాలం నుంచే..
ఈ లెక్కల నగలు చాలా ఏండ్ల కిందటనే తయారయ్యాయని అనేక చారిత్రక సాక్ష్యాల ద్వారా తెలుస్తోంది. రాతియుగం, లోహయుగంలోనూ రకరకాల ఆకారాల్లో తయారుచేసిన నగలు లభ్యమవుతున్నాయి. అదే స్పూర్తితో ఇప్పుడూ మళ్లీ అందరిని ఆకట్టుకునేలా అదిరిపోయే ఆధునిక హంగులద్దుకుని ముస్తాబవుతున్నాయి. ఇప్పుడు కూడా చతురస్రం, దీర్ఘ చతురస్రాల ఆకారాల్లో ఉండే గ్రానైట్, మార్బుల్ వంటి ఖరీదైన రాళ్లతో చక్కని నగలు తయారవుతున్నాయి. సంప్రదాయ దుస్తులపైనే కాకుండా ఆధునిక దుస్తులపైనా చక్కగా నప్పుతూ అందరినీ ఆకర్షిస్తున్నాయి.
చెక్కతో లెక్కలు..
రానురాను బంగారం, వెండి, ప్లాటినం వంటి ఖరీదైన లోహాలతో చేసే నగలకంటే వుడ్, సిల్క్, ఫ్యాబ్రిక్, పేపర్, గ్లాస్.. వంటి ఇతర పదార్థాలతో చేసిన నగలకే ఆదరణ పెరుగుతోంది. చూసేందుకు చక్కగా, ధరలనూ చవకగా అందరికీ అందుబాటులో ఉండడంతో భిన్నవిభిన్నవైన నగలు కనువిందు చేస్తున్నాయి. చెక్కతో చేసిన వృత్తాలు, చతురస్రాలను పెండెట్లుగా, బ్రాస్‌లెట్లుగా ధరించడం చాలా కాలం నుంచి వస్తున్న అలవాటే. అయితే ఇప్పడు చెక్కతో చేసిన రకరకాల ఆకారాలను పొందికగా అమర్చి హారాలు, నక్లెస్‌లు కూడా తయారుచేస్తున్నారు. ఈ ఆభరణాల తయారీలో ఎరుపు, నలుపు చెక్కను వాడి పైనుంచి వార్నిష్‌తో ఫినిషింగ్ ఇవ్వడంతో తళుక్కుమంటూ మగువల మనసు దోచేస్తున్నాయి. రకరకాల రంగులు అద్ది రంగురంగుల మ్యాచింగ్ నగలను కూడా తయారు చేస్తున్నారు. చీరలు, డ్రెస్సుల మీదకి చూడగానే తళుక్కుమనేలా అచ్చంగా సరిపోయే మ్యాచింగ్ నగలుంటే చాలు వాటిముందు బంగారు నగలు కూడా దిగదుడుపే.
అంకెల గారడి..
నమ్మకాలు, ఆచారాలను అనుసరిస్తూ కూడా ఈ లెక్కల నగలను ధరిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం అదృష్ట సంఖ్యలు, ప్రేమకు చిహ్నాలుగా, పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేకమైన రోజులతో పాటు జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు.. ఇలా జీవితంలో ప్రత్యేకంగా నిలిచే ప్రతి సందర్భాన్ని పొందుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు చాలామంది. ఆయా తేదీలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా నగల్లో ఇనుమడించి ఉంగరాలు, చైన్‌లు, బ్రేస్‌లెట్లుగా ధరిస్తారు. నగల తయారీలోనూ పూసలు, రాళ్ళు వంటి అదనపు ఆకర్షణలను జోడించే సమయంలోనూ అంకెల లెక్క ఉంటుంది. ఇష్టమైన సంఖ్య వచ్చేలా రకరకాల అంకెలను జతచేస్తారు.
కొత్తగా.. భిన్నంగా..
అందరిలోనూ ప్రత్యేకంగా కనపడేందుకు, అందరినీ ఆకర్షించేందుకు ఈ లెక్కల నగలు చక్కగా పనిచేస్తాయి. కొత్తగా, భిన్నంగా కనపడుతూ ఆధునికత ఉట్టిపడేలా ఉండే ఈ లెక్కల నగలు అన్ని దుస్తుల మీదా చక్కగా నప్పుతాయి. కాలేజీలు, కార్యాలయాలకు వెళ్ళేవారు రోజూవారి నగలుగా వాడుకునేందుకు చక్కగా ఉంటాయి. సరైన కొలతలతో ఆభరణాలు ఆకర్షణీయంగా తయారయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడే లెక్కలు కూడా అందమైన నగలుగా మారి అందరి మనసూ దోచేస్తున్నాయి.