ఈ ఆలయంలో శివయ్య వేలుని మాత్రమే పూజిస్తారు!
Achaleshwar Temple: సాధారణంగా శివాలయాల్లో లింగాన్ని లేదా శివయ్య విగ్రహాన్ని పూజిస్తుంటారు. కానీ ఈ ఒక్క ఆలయంలో మాత్రం శివయ్య వేలిని మాత్రమే పూజిస్తారట. ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం.
ఈ ఆలయం పేరు అచలేశ్వర్ మహదేవ్ ఆలయం. రాజస్థాన్లోని మౌంట్ అబులో ఉంది. ఈ ఆలయం గురించి శివపురాణం, స్కంద పురాణంలోనూ ప్రస్తావించారు. వశిష్ఠ ముని తపస్సు చేసిన ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. దాదాపు ఐదు వేల సంవత్సరాల కాలం నాటి ఆలయం ఇది. ఆలయ ప్రవేశ ప్రాంతంలో రెండు ఏనుగు బొమ్మలు ఉంటాయి. ఆలయంలోకి ప్రవేశిస్తుండగా నంది విగ్రహం ఉంటుంది. దీనిని పంచదాతులతో తయారుచేసారట. దీని బరువు 4 టన్నులు. ఆలయంలో లోపల 108 శివలింగాలు ఉన్నాయి.
గర్భగుడిలోని నాగ దేవత విగ్రహం వద్ద ఉన్న చిన్న గుంతలో శివయ్య వేలు దర్శనమిస్తుంది. ఇందులో ఎన్ని నీళ్లు పోసినా కూడా ఈ గుంత నిండదట. ఇదే ఆలయంలో కాలభైరవుడి గుడి కూడా ఉంది. ఈ ఆలయ పూజారి వివరణ ప్రకారం.. ఐదు వేల సంవత్సరాల క్రితం.. ఇంద్రుడు బ్రహ్మదేవుడి చేత ఈ గుంత తవ్వించారట. వశిష్ఠ ఆశ్రమంలో నివసించే ఓ ఆవు మాటి మాటికీ ఈ గుంతలో పడిపోతుండేదట. అప్పుడు వశిష్ఠ మహర్షి సరస్వతి దేవి సాయంతో ఆ ఆవుని బయటికి తీయించారు. ఇప్పటికీ ఈ ఆలయంలో ఉండే ఆవు నోటి నుంచి నీళ్లు పడుతూనే ఉంటాయట.