Confidence రావడం లేదా?
Hyderabad: కాన్ఫిడెన్స్.. (confidence) మన జీవితాన్ని నిరంతరం నడిపించేది ఇదే. ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడదు. మనలోనే ఉంటుంది. కానీ మనలో చాలా మంది ఇంట్రోవర్ట్‌లే ఉంటారు. దాంతో ఈ కాన్ఫిడెన్స్ (confidence) బయటకు కనిపించదు. మరి ఎలా? ఎలా మనలో ఆ కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరిగేది?
మనం జీవితంలో ఏదైనా సాధిస్తే దాని గురించి తలుచుకుంటూ తెగ సంబరపడిపోతుంటాం. కానీ ఫెయిల్ అయితే మాత్రం బాధపడుతుంటాం కానీ నలుగురికీ చెప్పుకోలేం. చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు కానీ.. సక్సెస్‌ని ఎలా తీసుకుంటారో ఫెయిల్యూర్‌ని కూడా అలాగే తీసుకోవడం మొదలుపెట్టండి. కాన్ఫిడెన్స్ లెవల్స్ పెరగడానికి ఇది చక్కటి మార్గం.
ఒక పనిని పర్‌ఫెక్ట్‌గా చేయడం అనేది ఉండదు. మీరు ఎలా చేస్తే రిజల్ట్ వస్తుంది అనుకుంటారో అలాగే చేయండి. అంతేకానీ పక్కవాడు ఏదో చేసేసాడు కదా అని మిమ్మల్ని మీరు తక్కువగా చూసుకోకండి. మీరు ఏదైనా చేయాలనుకున్న ప్రతీసారి నలుగురికి చెప్పి వారి నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొందరు ఇలాగే ఉంటారు. నేను అది చేయనా? అలా చేస్తే బాగుంటుందా? అని ఇతరులను అడుగుతుంటారు. మీకు నచ్చినది మీరు చేయడానికి వేరే వాళ్ల అప్రూవల్ ఎందుకు? అక్కడే మీ కాన్ఫిడెన్స్ లెవల్స్ పడిపోతాయి.
కాన్ఫిడెంట్‌గా ఉండటం అంటే భయం లేకుండా ఉండటం అని కాదు. ఆ భయాన్ని ధైర్యంగా ఎదుర్కోగలడం. మీకు ఏ విషయమైనా తలుచుకుంటే భయం వేసింది అనుకోండి.. అంటే మీకు నలుగురిలో మాట్లాడాలి అంటే భయం అనుకుందాం. ఫస్ట్ ఆ పని చేసేయండి. నలుగురిలో మాట్లాడేందుకు ప్రయత్నించి చూడండి. ఆ తర్వాత మనల్ని ఎవడ్రా ఆపేది అనే ఆలోచన వస్తుంది చూడండి.. అదే మీ కాన్ఫిడెన్స్.
కంఫర్ట్ జోన్‌లో ఉంటున్నారా? ఇది చాలా ప్రమాదకరం. కాన్ఫిడెన్స్‌ను కోల్పోవడానికి ప్రధాన కారణం కంఫర్ట్ జోనే. నాకు ఇలాగే బాగుంది.. నాకు ఈ ఉద్యోగమే బాగుంది అనుకుంటే ఇక ఏదీ సాధించలేరు. అలాగని నచ్చిన ఉద్యోగం చేయడం తప్పు అని చెప్పడంలేదు. మీరు చేస్తున్నది ఏదైనా సరే మీ జీవితానికి సంతృప్తిని ఇస్తోంది అంటే ఇక ఎవరి మాటా వినకండి. కానీ అంతకు మించి సక్సెస్‌ని చూడాలంటే మాత్రం ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సిందే.