Sri Rama Navami: రామ అనే పేరు ఎలా వచ్చింది? ఎవరు పెట్టారు?
Sri Rama Navami: చాలా మందికి రామాయణం, రాముడి వనవాసం వంటి కథలు తెలిసే ఉంటాయి. కానీ రామయ్యకు రామ అనే పేరు ఎలా వచ్చిందో మాత్రం తెలిసి ఉండదు. అసలు రామ అనే పేరు ఎలా వచ్చింది? ఆ పేరుతో ఎవరు నామకరణం చేసారు?
రఘుకులానికి చెందిన వశిష్ఠ మహారాజు రామ అని నామకరణం చేసినట్లు పురాణాలు చెప్తున్నాయి. రామయ్య పుట్టినప్పుడు ఆయనకు దశరథ రాముడు అని నామకరణం చేసారట. రామ అనేది రామయ్యకు ఉన్న 394వ పేరు. ఓం నమో నారాయణాయ అనే మంత్రం నుంచి రా అనే అక్షరం.. ఓం నమః శివాయ నుంచి మ అనే అక్షరాన్ని తీసుకుని రామ అని పెట్టారు. రాముడికే కాదు ఆయన సోదరులు భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడికి కూడా వశిష్ఠ మహర్షే నామకరణం చేసారట.
రామ చంద్ర అని ఎందుకు పిలుస్తారు?
రామయ్యను శ్రీరామచంద్రమూర్తి అని కూడా పిలుస్తారు. చంద్ర అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఓసారి చంద్రుడు దిగాలుగా ఉంటే.. రామయ్య ఏమైంది అని అడిగాడట. అప్పుడు చంద్రుడు.. అందరు దేవుళ్లు సూర్యుడికే ప్రాధాన్యత ఇస్తున్నారని తనను ఎవ్వరూ పట్టించుకోవడంలేదని అన్నాడు. అప్పుడు రామయ్య ఒక చిరు నవ్వు నవ్వి.. “” దానికి ఎందుకు అంత బాధపడతావు. నా తరువాతి అవతారంలో ద్వాపరయుగంలో అంతా నిన్నే కొలుస్తారు. వచ్చే అవతారంలో చంద్రమానం దక్షిణాయన పుణ్యకాలం శ్రావణ మాసంలోని కృష్ణ పక్షంలో అర్థరాత్రి రోహిణి నక్షత్రం సమయంలో జన్మిస్తాను. ఇవన్నీ నీకు సంబంధించివవే కదా..! “” అని చెప్పాడు.
ఇది విన్నాక కూడా చంద్రుడికి బాధ తగ్గలేదు. త్రేతాయుగం అయ్యాక ద్వాపరయుగం అంటే చాలా ఏళ్లు వేచి చూడాల్సి వస్తుందని అంటాడు. అప్పుడు రాముడు ఒక మాట ఇచ్చాడట. తన పేరు పక్కన చంద్ర అని పెట్టుకుంటానని.. అప్పుడు రామచంద్ర అని పిలుస్తారని అన్నాడట. అది విని చంద్రుడు ఎంతో సంతోషించాడని అలా రామయ్యకు శ్రీరామచంద్రుడు అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి.