అసాధారణ నెలసరితో గుండెపోటు!
గుండెపోటు రావడానికి సాధారణంగా అధిక రక్తపోటు, అసాధారణ బరువు, అధిక కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కారణాలని అందరికీ తెలిసిందే. కానీ మహిళల్లో నెలసరి క్రమంలో తేడాలు వచ్చినా గుండెపోటు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అంతేకాదు, చిన్న వయస్సులో పిల్లలకు జన్మనిచ్చినా, ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చినా, చిన్నవయస్సులోనే రుతక్రమం ప్రారంభం కావడం వల్ల గుండె జబ్బులు ప్రమాదం పెరుగుతుందనేది ఇటీవల అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం సారాంశం. పునరుత్పత్తి కారకాలు, కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, స్ట్రోక్ వంటి కార్డియాక్ సంబంధ మధ్య సంబంధంపై పరిశోధకులు అధ్యయనం చేశారు. మహిళ పునరుత్పత్తి వ్యవస్థ పనితీరు వారి గుండె ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం…
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు చేసిన పరిశోధనలో స్త్రీలలో పునరుత్పత్తి, హృదయ సంబంధ వ్యాధుల మధ్య సంబంధంపై అధ్యయనం జరిపి, సమస్యలు నివారణ చర్యలను పేర్కొన్నారు. గర్భధారణ సమయంలో స్త్రీలు శరీర ఇన్ఫ్లమేషన్, రక్తం గడ్డకట్టడాన్ని ప్రోత్సహించే శారీరక మార్పులను ఎదుర్కొంటారు. పీసీఓఎస్ (పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్), ప్రీఎక్లంప్సియా వంటి సమస్యలు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి.
గుండె పోటు సంభవించడానికి అనేక కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, అధిక బరువు, మద్యాపానం, ధూమపానం వంటి కారణాలతోనూ గుండె సంబంధ సమస్యలు వచ్చే ముప్పు ఉంటుంది. హైపర్‌టెన్షన్, అధిక కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్, ఒత్తిడి, ఆందోళన కారణంగానూ గుండె సంబంధ సమస్యలు సంభవించవచ్చు.
మహిళలు మెనోపాజ్ దశకు చేరుకునే కొద్దీ ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గుతూ వస్తాయి. ఈస్ట్రోజెన్ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఈస్ట్రోజెన్ హార్మోన్ మంచి కొలెస్ట్రాల్ హార్మోన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది, రోగనిరోధక వ్యవస్థపైనా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు. మెనోపాజ్ తర్వతా.. మహిళలలో ఈస్ట్రోజన్ హార్మన్ విడుదల ఆగుతుంది. దీని కారణంగా వారిలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్, బెల్లీ ప్యాట్ పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. నెలసరి ఆగిన తర్వాత.. లిపిడ్ ప్రొఫైల్ మారవచ్చు. మెనోపాజ్ తర్వాత మహిళలలో ధమనులు పెద్దగా, గట్టిగా మారతాయి. హైపర్‌టెన్షన్, ధమనుల ముప్పు పెరుగుతుంది.
ఆరోగ్యకరమైన జీవనశైలితో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. సరైన పోషకాహారం, ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం, తరచుగా డాక్టరును సంప్రదించడం, నెలసరి సమస్యలను తేలికగా తీసుకోకుండా తగిన మందులు వాడటం వంటి చర్యలతో మహిళల్లో గుండె సంబంధ సమస్యల ముప్పుని తగ్గించవచ్చు.