గుడిలో గంట ఎందుకు కొట్టాలి.. ఎందుకు ప్రదక్షిణలు చేయాలి?
మన నిత్య జీవితంలో కొన్ని పనులను అలవాటు అయిపోయినట్లుగా చేసుకుంటూ పోతాం. ఉదాహరణకు గుడికి వెళ్లినప్పుడు గంట కొడతాం.. తీర్థం తీసుకుంటాం.. ప్రదక్షిణలు చేస్తాం. ఇవన్నీ ఎందుకు చేయాలి? అసలు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో తెలుసుకుందాం. (spiritual)
దేవుడు అన్ని చోట్లా ఉంటాడు అంటారు. మరి అలాంటప్పుడు గుడికి వెళ్లి విగ్రహాల ముందు నిలబడి ఎందుకు దండం పెట్టుకుంటాం? ఎందుకంటే.. మనం ఊహించుకునే దాని కంటే కళ్లతో చూసిన దానినే నమ్ముతాం కాబట్టి. మనం దేవుడిని ఊహించుకుంటూ పూజ చేయలేం. కానీ ఎదురుగా దేవుడి విగ్రహం లేదా ఫోటో ఉంటే నిష్ఠగా పూజ చేసుకుంటాం. అందులోనూ విగ్రహాలు అంటే ఏదో రాయితో తయారుచేసినవి అనుకుంటారు కొందరు మూర్ఖులు. కానీ కొన్ని విగ్రహాలు స్వయంభువుగా ఏర్పడితే.. మరికొన్నింటిని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు.
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు భక్తులు గుండు చేయించుకుంటారు. ఇంకొందరు తల నీలాలు అర్పిస్తారు. కేవలం జుట్టు మాత్రమే ఎందుకు అర్పిస్తున్నాం.. గోళ్లు ఎందుకు అర్పించడం లేదు? ఎందుకంటే మనిషికి జుట్టు అనేది ఒక గర్వకారణమైన అనుభూతిని కలిగిస్తుంది. అందుకే జుట్టు రాలిపోతున్నా.. బట్టతల వచ్చినా కూడా మానసికంగా కుంగిపోతుంటారు. అలాంటి జుట్టుని మనం దేవుడికి అర్పిస్తున్నామంటే అహం, గర్వం పక్కనపెట్టి భక్తితో చేస్తున్నామని ఆయనకు చెప్పుకుంటున్నట్లు అర్థం. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనం జుట్టును అర్పిస్తున్నామంటే మనల్ని మనం త్యాగం చేసుకుంటున్నామని అర్థం. (spiritual)
మీరు గమనించినట్లైతే.. ఆలయాలు ఎక్కువగా మన దేశంలో ఎత్తైన కొండలపైనే ఉంటాయి. ఆ ఆలయాలను చేరుకోవాలంటే కొన్ని కిలోమీటర్లు నడవాలి.. లేదా కొన్ని వందల మెట్లు ఎక్కాలి. ఎందుకిలా అంటే.. మనకు జీవితంలో సులువుగా ఏదీ దొరకదు.. దాని కోసం కష్టపడాలి అని అర్థం. ఇప్పుడు దేవుడు మనకు రెండు అడుగుల దూరంలో ఉంటే దర్శించుకోవడం వేరు. కానీ తిరుమల లాంటి కొండలు నడిచి ఎక్కి దర్శించుకోవడం వేరు. తనను చేరుకోవాలంటే అంత సులువు కాదు అని తెలియజేయడానికే దేవుడు కొండలపై ఆసీనులవుతారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. కొండలపై కొలువై ఉండే ఆలయాలను దర్శించుకుంటే మనకు స్వచ్ఛమైన గాలి కూడా అందుతుంది. ఎందుకంటే కొండలపై కింద ఉన్నంత కాలుష్యం ఉండదు. స్వచ్ఛమైన గాలి ఉంటుంది.
ఇక ప్రదక్షిణలు గురించి చెప్పాలంటే.. సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు తిరిగినట్లు.. మనం కూడా నవగ్రహాల చుట్టూ కుడి వైపుగా ప్రదక్షిణలు చేస్తుంటాం. సూర్యుడి చుట్టూ ఇతర గ్రహాలు తిరుగుతున్నప్పుడు.. సూర్యుడు వాటిని తన చుట్టూ ఉండేలా అంటిపెట్టుకుని ఉంటాడు. అలా చేయకపోతే ఆ గ్రహాలు అదుపు తప్పి విడిపోతాయట. అదే విధంగా మనం ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు పక్కదారిలో పడకుండా ఆ దైవం కాపాడుతుందని అర్థం. అంటే మనల్ని సరైన మార్గంలో నడిపించు తండ్రీ అని దైవాన్ని కోరుకుంటున్నట్లు అర్థం.
గుడికి వెళ్లగానే గంట కొట్టకుండా ఉండలేం. ఆ గంటను ఎందుకు కొట్టాలి? ఎందుకంటే.. అది కొన్ని శక్తిమంతమైన మెటల్స్‌తో తయారుచేయబడి ఉంటుంది. గంటను కొట్టిన కొన్ని సెకెన్ల పాటు దాని ప్రతిధ్వని వినిపిస్తుంది. అప్పుడు మన శరీరంలోని ప్రతి అణువుపై ప్రభావం చూపి ఏకాగ్రత పెరిగేలా చేస్తుంది. (spiritual)
మనం గుళ్లకు వెళ్లినప్పుడు పూజారులు చేతికి దారాలు కడుతుంటారు. అవి కట్టడం వెనుక ఉన్న సైన్స్ ఏంటంటే.. మన శరీరంలో దాదాపు 70 వేల నరాలు ఉంటాయి. ఆ నరాలన్నింటికీ మూలం మన నాడి. అందుకే నాడి దగ్గర ఆ దారాలను కడతారు. మగవారికైతే కుడి వైపు ఆడవారికి ఎడమ వైపు కడుతుంటారు. చేతి నాడి దగ్గర దారాన్ని కాస్త గట్టిగా కడితే అది ఇతర నరాలను ఉత్తేజితం చేసి రక్తప్రసరణ బాగా జరిగేలా చూస్తుందట.